శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 29, 2020 , 00:11:19

టీ హబ్‌ 2 మార్చికి రెడీ

టీ హబ్‌ 2 మార్చికి రెడీ

ఆలోచనలకు ఆవిష్కరణ రూపం

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ 

3.12 ఎకరాల్లో 3.72 లక్షల చ.అడుగుల్లో ఏర్పాటు

రూ.276 కోట్లతో నిర్మాణం.. వెయ్యి స్టార్టప్‌లకు అవకాశం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆలోచనలు ఆవిష్కరణలుగా రూపుదిద్దుకొనే టీ హబ్‌-2 వేగంగా సిద్ధమవుతున్నది. ప్రపంచంపై ప్రభావం చూపగలిగే మహా ఆవిష్కరణలకు ఇది నెలవు కాబోతున్నది. టెక్నాలజీ ప్రియులకే కాదు.. సామాన్యులకు సైతం అవసరమైన వస్తువులు తయారయ్యే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌  మార్చినాటికి పూర్తికానున్నది. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో రూ.276 కోట్లతో  3.12 ఎకరాల్లో 3.72 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు లక్షల చదరపు అడుగుల పార్కింగ్‌ ఏరియా ఉండనున్నది. సివిల్‌ వర్క్స్‌ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియర్‌ పనులు కొన్ని చేయాల్సి ఉన్నది. 2017 జనవరిలో దీనికి శంకుస్థాపన చేశారు. తొలుత నిర్ణయించిన లక్ష్యం ప్రకారం ఇప్పటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. కానీ, కరోనా వ్యాప్తి కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఇది పూర్తయితే దేశంలోనే కాదు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌గా గుర్తింపు పొందనుంది. ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ పారిస్‌లో 3.70 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. టీ హబ్‌ మొదటి భవనాన్ని ట్రిపుల్‌ ఐటీకి అప్పగించనున్నారు. అక్కడి స్టార్టప్‌లు ఇక్కడికి మార్చనున్నారు. ఇక్కడ 1000 పైగా స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను రెండు వేలకు పెంచే అవకాశాలున్నాయి.

 టీ హబ్‌-1 స్ఫూర్తితో..

గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో రూ.40 కోట్లతో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్‌ 2015 నవంబర్‌ 5న ఏర్పాటైంది. 200 స్టార్టప్‌లు, వెయ్యి మంది పనిచేసుకొనేలా దీన్ని రూపొందించారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆలోచనల మేరకు ప్రపంచస్థాయి పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతిక వసతులు, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌ డిజైన్లతో పూర్తి ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్‌ నిర్మించారు. అనతికాలంలోనే అనేక అద్భుతాలు సృష్టించిన టీ హబ్‌ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా అవతరించింది. దీన్ని చూసి మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల, ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌సిక్కా, అరోబా నెట్‌వర్క్‌ కో ఫౌండర్‌ కీర్తి మెల్కొటే టీ హబ్‌ను చూసి అబ్బురపడ్డారు. ఈ నేపథ్యంలో ఎక్కువ స్టార్టప్‌లకు అవకాశం కల్పించేందుకు మంత్రి కేటీఆర్‌ సూచనలతో టీహబ్‌-2 నిర్మాణం మొదలైంది. 

VIDEOS

logo