శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 06, 2020 , 00:20:07

సూరత్‌ డైమండ్‌కు వైరస్‌

సూరత్‌ డైమండ్‌కు వైరస్‌
  • 8 వేల కోట్ల నష్టాల భయంలో పరిశ్రమ
  • హాంకాంగ్‌లో ఎమర్జన్సీయే కారణం

సూరత్‌, ఫిబ్రవరి 5: సూరత్‌ వజ్రాల పరిశ్రమ రాబోయే రెండు నెలల్లో దాదాపు రూ.8,000 కోట్ల నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందనిపిస్తున్నది. ఇందుకు కారణం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లో ప్రకటించిన అత్యవసర పరిస్థితే. సూరత్‌ డైమండ్‌ ఇండస్ట్రీ నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతులు జరిగేవి హాంకాంగ్‌కే మరి. కానీ చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌ విలయ తాండవం సృష్టిస్తుండటంతో హాంకాంగ్‌ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నది. ప్రజలు బయటకు రాకపోవడం, అక్కడి సంస్థలు ఇంటి నుంచే పని చేయాలంటుండటంతో వీధులు బోసిపోతున్నాయి. ఫలితంగా అన్ని వ్యాపారాలపైనా ఈ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ప్రధానంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు బ్రేక్‌ పడగా, వారి షాపింగ్‌ ఆదాయం దూరమైపోయింది. ఇప్పటికే మార్చి మొదటి వారం వరకు పాఠశాలలు, కళాశాలలకు హాంకాంగ్‌ సర్కారు సెలవులను ప్రకటించింది. దీంతో యువత సైతం ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తున్నది. ఇది వాలెంటైన్స్‌ డే (ఫిబ్రవరి 14) అమ్మకాలను దెబ్బ తీస్తున్నది.


ఏటా రూ.50 వేల కోట్ల ఎగుమతులు

ఏటా హాంకాంగ్‌కు సూరత్‌ నుంచి సుమారు రూ.50,000 కోట్ల విలువైన సానబెట్టిన వజ్రాలు ఎగుమతి అవుతాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రాంతీయ చైర్మన్‌ దినేశ్‌ నవదియా తెలిపారు. సూరత్‌ వజ్రాల పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో ఇది 37 శాతమని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా హాంకాంగ్‌లో నెల రోజులపాటు సెలవులను ఇచ్చారని, దీంతో అక్కడి గుజరాత్‌ ట్రేడర్ల కార్యాలయ సిబ్బందీ ఇప్పుడు భారత్‌కు వస్తున్నారన్నారు. ఈ విపత్కర పరిస్థితులు చక్కబడకపోతే సూరత్‌ డైమండ్‌ ఇండస్ట్రీకి చాలా పెద్ద ప్రమాదమని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి, మార్చి నెలలకుగాను రూ.8,000 కోట్ల నష్టాలను అంచనా వేశారు. దేశంలోకి దిగుమతయ్యే ముడి వజ్రాల్లో 99 శాతం వజ్రాలను సూరత్‌లోని సంస్థలే సానబెడుతున్నాయి. హాంకాంగ్‌ మార్కెట్‌ మీదుగానే సూరత్‌ సానబెట్టిన వజ్రాలు ప్రపంచ మార్కెట్‌కు వెళ్తాయని, అందుకే ఇప్పుడా దేశ ఎమర్జన్సీ మమ్మల్నీ వణికిస్తోందని వజ్రాల వ్యాపారి ప్రవీణ్‌ నానావతీ అన్నారు.


logo