శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 02, 2020 , 00:58:05

ఎల్‌ఐసీ ప్రైవేట్‌పరం!

ఎల్‌ఐసీ ప్రైవేట్‌పరం!
  • గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
  • ఐపీవోకి రాబోతున్న బీమా దిగ్గజం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: బంగారుబాతును ప్రైవేట్‌ పరం చేయడానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వరంగ వాటాల విక్రయానికి పెద్ద దిక్కులా వచ్చిన ఎల్‌ఐసీలో వాటాలను అమ్మకానికి పెట్టబోతున్నది కేంద్రం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు 2020-21 ఏడాదికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌ సందర్భంగా మంత్రి వెల్లడించారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ)లో కేంద్రానికి 100 శాతం వాటా ఉన్నది. ఎంత శాతం వాటా విక్రయించేదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ...మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మార్గదర్శకాల ప్రకారం లిస్టెడ్‌ కంపెనీల్లో 35 శాతం వాటాను విక్రయించాల్సి ఉంటుంది. 


ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు

ఎల్‌ఐసీలో వాటాల విక్రయ ప్రతిపాదనను కంపెనీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎల్‌ఐసీలో తనకున్న వాటాలో కొంతమేర విక్రయించాలనుకున్న ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. ఈ చర్య జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని ఉద్యోగ సంఘాల ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా త్వరలో దేశవ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఎప్పడు చేసేదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 1956లో ప్రారంభమైన ఎల్‌ఐసీ..లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో అత్యధిక మార్కెట్‌ వాటాను కలిగివున్నది. ప్రస్తుతం సంస్థలో 1,11,979 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ‘మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణల్లో భాగంగా ఎల్‌ఐసీ చేత చాలా సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారు..ఇవన్నీ నష్టాల్లో ఉన్న సంస్థలు, కొన్ని దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంస్థపై ప్రభుత్వ పెత్తనాన్ని కొనసాగనివ్వబోమని దక్షిన జోన్‌ బీమా ఉద్యోగుల ఫెడరేషన్‌ జాయింట్‌ కార్యదర్శి శివసుబ్రమణియన్‌ హెచ్చరించారు. 


అతిపెద్ద సంస్థగా అవతరణ!

ఎల్‌ఐసీ మార్కెట్లో లిైస్టెయితే దేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించే అవకాశాలు పుష్కలం. ప్రస్తుతం కంపెనీకి ఉన్న ఆస్తులు, పెట్టుబడులు చూస్తే..రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను మించిపోనున్నది. ఇప్పటి వరకు సంస్థ రూ.31.11 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. మార్చి 2019 నాటికి రూ.26 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఎల్‌ఐసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల మధ్యలో ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో స్టాక్‌ మార్కెట్లో అడుగుపెట్టిన సౌదీకి చెందిన అరామ్‌కో మార్కెట విలువ 117.82 బిలియన్‌ డాలర్లు.


logo