శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 28, 2020 , 01:55:06

సొంతిల్లు కలకాదు...నిజం

సొంతిల్లు కలకాదు...నిజం

  • పీఎంఏవై కింద 2.67 లక్షల వరకు సబ్సిడీ

తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం ఉన్నప్పటికీ సొంత గూడులేని అభాగ్యులు దేశంలో ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు జీవితకాల స్వప్నమే. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ఒకటి. 2022లోగా దేశంలోని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చాలన్న ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి ప్రభుత్వం రూ.2.67 లక్షల వరకు రుణ ఆధారిత (క్రెడిట్‌ లింక్డ్‌) సబ్సిడీని అందజేస్తున్నది. దీన్ని పొందాలంటే రుణగ్రహీతలు కొన్ని అర్హతలను కలిగి ఉండటంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించి తీరాలి. అవేమిటంటే..

ప్రాథమిక నిబంధనలు

రుణగ్రహీతలు ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్‌) వర్గానికి చెందినవారై ఉండాలి. వార్షికాదాయం రూ.3 లక్షలకు మించకూడదు. అల్పాదాయ వర్గానికి (లోయర్‌ ఇన్‌కమ్‌ గ్రూపునకు) చెందినవారైతే వార్షికాదాయం రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్యలో ఉండాలి.

పై రెండు వర్గాల వారికి గరిష్ఠంగా రూ.2.67 లక్షల సబ్సిడీ అందజేస్తారు. ఒకవేళ రుణగ్రహీతలు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న మధ్యాదాయ గ్రూపు-1 (ఎంఐజీ-1) వారైతే రూ.2.35 లక్షల సబ్సిడీ.. వార్షికాదాయం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల్లోపు ఉన్న ఎంఐజీ-2 గ్రూపు వారైతే రూ.2.30 లక్షల సబ్సిడీ ఇస్తారు.

 ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ క్యాటగిరీల వారికి కేవలం రూ.6 లక్షల వరకు రుణాలపై మాత్రమే క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ లభిస్తుంది. ఈ పరిమితి ఎంఐజీ-1 క్యాటగిరీలోని రుణగ్రహీతలకు రూ.9 లక్షలుగా, ఎంఐజీ-2 క్యాటగిరీలోని రుణగ్రహీతలకు రూ.12 లక్షలుగా ఉంటుంది. 

మరోవైపు పీఎంఏవై కింద రుణ ఆధారిత సబ్సిడీని పొందాలనుకునే రుణగ్రహీతకు అప్పటికే సొంత ఇల్లు ఉండకూడదు. అతను సమకూర్చుకునే ఇంటికి అతనితోపాటు ఓ మహిళ సహ యజమానిగా, సహ రుణగ్రహీతగా ఉండాలని మూడో నిబంధన స్పష్టం చేస్తున్నది. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ పొందాలనుకునేవారు రుణం కోసం పీఎంఏవై కింద బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రుణం మంజూరైన తర్వాత సబ్సిడీ పొందేందుకు రణగ్రహీతకున్న అర్హతలను బ్యాంకు పరిశీలిస్తుంది. అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని తేలితే కేంద్రీయ నోడల్‌ ఏజెన్సీ (సీఎన్‌ఏ)ల నుంచి సబ్సిడీ కోసం బ్యాంకు క్లెయిమ్‌ చేస్తుంది. పీఎంఏవైకి ప్రస్తుతం హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో), నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) నోడల్‌ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఈ ఏజెన్సీలే నేరుగా రుణగ్రహీతల రుణ ఖాతాల్లోకి నిధులను విడుదల చేస్తాయి. సబ్సిడీ దరఖాస్తు సమర్పించిన తర్వాత సీఎన్‌ఏ నుంచి నిధులు అందేందుకు దాదాపు 6 నెలల వరకు సమయం పడుతుంది.

సబ్సిడీ అందడం ఆలస్యమైందా?


ఇప్పటికే పీఎంఏవై కింద రుణాలు పొందినవారిలో చాలా మంది సబ్సిడీ రావడం ఆలస్యమవుతున్నదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. రుణగ్రహీత ప్రకటించిన ఆదాయానికి, అతని అసలు ఆదాయానికి మధ్య తేడా ఉన్నా, లేక అతనికి అప్పటికే ఓ ఇల్లు ఉన్నా దరఖాస్తును తిరస్కరిస్తారు. 

పీఎంఏవై కింద లబ్ధి పొందేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సరిగా పాటించకపోయినా, మహిళను కేవలం సహ రుణగ్రహీతగా మాత్రమే చూపినా సబ్సిడీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. దరఖాస్తులో తప్పులు దొర్లినా.. ఆధార్‌, ఇతర డాక్యుమెంట్లలోని పేరు సరిపోలకపోయినా.. దరఖాస్తులను బ్యాంకర్లు ఆలస్యంగా దాఖలు చేసినా సబ్సిడీ రావడం జాప్యమవుతుంది. అయితే దరఖాస్తులను త్వరగా ప్రాసెస్‌ చేసేందుకు ప్రభుత్వం ‘పీఎంఏవైయూసీఎల్‌ఏపీ.గవ్‌.ఇన్‌' పేరుతో క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ సర్వీసెస్‌ ఆవాస్‌ పోర్టల్‌ (క్లాప్‌)ను ప్రారంభించింది. 

పరిష్కారం

సీఎన్‌ఏకి బ్యాంకర్‌ సబ్సిడీ దరఖాస్తును సమర్పించిన వెంటనే రుణగ్రహీతకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అప్లికేషన్‌ ఐడీ వస్తుంది. దీన్ని ఉపయోగించి సదరు రుణగ్రహీత ‘క్లాప్‌' పోర్టల్‌లో తన దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. అప్లికేషన్‌ స్టేటస్‌తోపాటు ఆ క్లెయిమ్‌కు సంబంధించి చేపట్టిన చర్యల వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా రుణదాతకు కూడా పంపుతారు. సబ్సిడీ రావడం ఆరు నెలల కంటే ఎక్కువ జాప్యమైతే రుణగ్రహీతలు ‘గ్రీవెన్స్‌-పీఎంఏవై@గవ్‌.ఇన్‌' పోర్టల్‌ ద్వారా లేఖ రాసి కారణమేమిటో తెలుసుకోవచ్చు.


VIDEOS

logo