గురువారం 04 జూన్ 2020
Business - Apr 09, 2020 , 23:48:41

ఉద్దీపనలపై ఆశలతో..

ఉద్దీపనలపై ఆశలతో..

  • భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
  • 1,266 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌
  • 363 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ
  • రూ.4 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్‌ విలువ

ముంబై, ఏప్రిల్‌ 9: ఉద్దీపనలపై మదుపరులలో నెలకొన్న అంచనాలు.. స్టాక్‌ మార్కెట్లను లాభాల్లో పరుగులు పెట్టించాయి. గురువారం ట్రేడింగ్‌లో చోటుచేసుకున్న కొనుగోళ్ల జోష్‌తో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 1,265.66 పాయింట్లు లేదా 4.23 శాతం పుంజుకుని 31,159.62 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఈ ఒక్కరోజే రూ.3.98 లక్షల కోట్లు ఎగబాకింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 363.15 పాయింట్లు లేదా 4.15 శాతం ఎగిసి 9,111.90 వద్ద నిలిచింది. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 31,225.20 స్థాయిని తాకింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. భారత్‌లోనూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి అంతానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. దీనివల్ల జరిగే నష్టాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలను సిద్ధం చేస్తుందన్న అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇప్పటికే ఓ దఫా ఉద్దీపనలను ప్రకటించిన మోదీ సర్కారు.. రెండో దశ ఉద్దీపనల్ని తేనుందన్న వార్తలు మదుపరుల దృష్టిని పెట్టుబడుల వైపునకు మళ్లించాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తిరిగి కోలుకోవడం కూడా మదు పరులను కొనుగోళ్ల దిశగా నడిపించింది. 

మెరిసిన ఆటో షేర్లు

ఆటో రంగ షేర్లు అత్యధికంగా 10.26 శాతం మేర లాభపడ్డాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ విలువ 16.74 శాతం ఎగిసింది. మారుతీ సుజుకీ 13.16 శాతం ఎగబాకింది. హీరో మోటోకార్ప్‌ 9.65 శాతం పెరిగింది. టైటాన్‌ షేర్‌ విలువ 11.12 శాతం పుంజుకున్నది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఫైనాన్స్‌, టెలికం, బ్యాంకింగ్‌, మెటల్స్‌ రంగా ల షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 9.32 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 9.29 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇం డ్‌ బ్యాంక్‌, నెస్లే షేర్లు నష్టాలపాలైయ్యాయి.


logo