సోమవారం 01 మార్చి 2021
Business - Dec 22, 2020 , 03:04:18

కరోనా 2.0..బ్లాక్‌ మండే షాక్!

కరోనా 2.0..బ్లాక్‌ మండే షాక్!

భీకర నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. వరుస లాభాలతో రోజుకో సరికొత్త రికార్డును సృష్టిస్తూ నూతన శిఖరాల్లో కదలాడుతున్న సూచీలు.. ఒక్కసారిగా భీకర నష్టాలకు లోనయ్యాయి. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ కొత్త రూపును సంతరించుకుంటున్నదన్న వార్తలు మదుపరులను భయాందోళనకు గురిచేశాయి. బ్రిటన్‌లో కొవిడ్‌-19 కొత్త జాతి వేగంగా వ్యాపిస్తుండటం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.

ముంబై, డిసెంబర్‌ 21:  కరోనా వైరస్‌ కొత్త భయాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 1,406.73 పాయింట్లు లేదా 3 శాతం పతనమై 45,553.96 వద్దకు క్షీణించింది. ఈ ఏడాది మే 4 తర్వాత కేవలం ఒక్కరోజే ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 432.15 పాయింట్లు లేదా 3.14 శాతం కోల్పోయి 13,328.40 వద్దకు దిగజారింది. దీంతో 6 రోజుల వరుస లాభాలకు తెరపడినైట్లెంది. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 2వేల పాయింట్లకుపైగా, నిఫ్టీ 600 పాయింట్లకుపైగా కోల్పోయాయి. అయినప్పటికీ చివరకు కాస్త కోలుకోగలిగాయి. ఇక సెన్సెక్స్‌లో ఓఎన్జీసీ షేర్‌ విలువ అత్యధికంగా 9.15 శాతం నష్టపోయింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ షేర్ల విలువ కూడా 6.98 శాతం మేర పడిపోయింది. బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌-క్యాప్‌ సూచీలు 4.57 శాతం దిగజారాయి.

  • బ్రిటన్‌లో కరోనా కొత్త వైరస్‌ కలకలం
  • తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి మదుపరులు
  • 1,407 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌
  • 432 పాయింట్లు దిగజారిన నిఫ్టీ

ఒకానొక దశలో ...

సెన్సెక్స్‌ గరిష్ఠంగా 2,037.61 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం 629.10 పాయింట్లు క్షీణించింది.


ట్రేడింగ్‌ సరళి ఇది..

నిజానికి ఉదయం సెన్సెక్స్‌ 202, నిఫ్టీ 67 పాయింట్ల నష్టాలతోనే ప్రారంభమైనా.. దాదాపు 2 గంటలపాటు స్వల్ప లాభనష్టాల మధ్యే సూచీలు కదలాడాయి. అయితే ఉదయం 11 గంటల తర్వాత నష్టాలకే పరిమితమయ్యాయి. అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ నష్టాలు తీవ్రరూపును సంతరించుకున్నాయి. 2 గంటలకు మరింతగా పడిపోయాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నా.. 3 గంటలకు 2వేల పాయింట్లకుపైగా సెన్సెక్స్‌, 600 పాయింట్లకుపైగా నిఫ్టీ పతనమయ్యాయి. కానీ మదుపరుల కొనుగోళ్ల జోరుతో ఆ తర్వాతి అరగంటలో మళ్లీ వేగంగా పెరిగాయి. అయితే చివర్లో మదుపరుల లాభాల స్వీకరణతో కొంతమేర తగ్గాయి.

6.59లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌ మార్కెట్ల భారీ నష్టాలు లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను ఆవిరి చేశాయి. బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ సోమవారం ఒక్కరోజే రూ.6.59 లక్షల కోట్లు దిగజారింది.

తీవ్ర అమ్మకాల ఒత్తిడి మధ్య రూ.6,59,313.65 కోట్లు క్షీణించి రూ.1,78,79,323.05 కోట్లకు ఇన్వెస్టర్‌ వెల్త్‌ పడిపోయింది. కాగా, మార్కెట్‌ లీడర్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ విలువ 2.92 శాతం క్షీణించి రూ.1,934 స్థాయికి దిగింది. దీంతో అత్యధికంగా రూ.1.28 లక్షల కోట్ల ఆర్‌ఐఎల్‌ సంపద హరించుకుపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ మార్కెట్‌ విలువ కూడా మొత్తంగా 67వేల కోట్లు పతనమైంది. ఇక బీఎస్‌ఈలో నమోదైన సంస్థల్లో 2,433 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. 592 షేర్లు లాభపడగా, 167 షేర్ల విలువ యథాతథంగా ఉన్నది.

ప్రపంచ మార్కెట్లూ డీలా..

ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, జపాన్‌ సూచీలూ నష్టాల్లో ముగిశాయి. చైనా, దక్షిణ కొరియా సూచీలు మాత్రం లాభాలను అందుకున్నాయి. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌లు 2.50 శాతం మేర పడిపోయాయి. బ్రిటన్‌కు పొరుగు దేశాలన్నీ ఇప్పటికే రాకపోకలను నిషేధించడం స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసింది. భారత్‌ సైతం బ్రిటన్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తామని ప్రకటించింది.

రూపాయి ఢమాల్‌

దేశీయ కరెన్సీ రూపాయి విలువ సోమవారం ఫారెక్స్‌ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకుల మధ్య రెండు వారాల కనిష్ఠానికి పడిపోయింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 23 పైసలు దిగజారి 73.79 వద్దకు క్షీణించింది. ఈ నెల 7 తర్వాత రూపాయికి ఇదే అత్యల్ప స్థాయి. ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 73.63 స్థాయికి బలపడిన రూపాయి విలువ.. మరొక దశలో 73.81 స్థాయికి దిగజారింది. బ్రిటన్‌లో కొవిడ్‌-19 కొత్త జాతి వేగంగా వ్యాపిస్తున్నదన్న వార్తలు.. యూరోజోన్‌ కరెన్సీని ప్రభావితం చేశాయని, ఇది రూపాయి నష్టాలకు దారితీసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • ఈ ఒక్కరోజే 5 సంస్థల మార్కెట్‌ విలువ రూ.1.95 లక్షల కోట్లు హరించుకుపోయింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ షేర్లు భీకరంగా పడిపోయాయి.  
  • 473 షేర్లు తమ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఇందులో స్పైస్‌జెట్‌, హిందుస్థాన్‌ కాపర్‌, గ్రాఫైట్‌ ఇండియా, టాటా స్టీల్‌ పీపీ, విపుల్‌, ప్రోజోన్‌ ఇంటూ తదితర షేర్లున్నాయి.
  • పలు మిడ్‌-క్యాప్‌ షేర్లు 12 శాతం వరకు విలువను కోల్పోయాయి. టాటా పవర్‌, కెనరా, ఫెడరల్‌ బ్యాంకులు, జీఎమ్మార్‌ ఇన్‌ఫ్రా, బీహెచ్‌ఈఎల్‌ వంటివి వీటిలో ఉన్నాయి.
  • భీకర నష్టాల్లోనూ ఎన్‌ఎస్‌ఈలోని 105 షేర్ల విలువ 52 వారాల గరిష్ఠాన్ని చేరాయి. క్యాడిలా, గ్లాండ్‌ ఫార్మా, సెరా శానిటరీవేర్‌, హెచ్‌ఐఎల్‌ తదితర షేర్లు ఇందులో ఉన్నాయి.
  • బీఎస్‌ఈ మెటల్‌, చమురు-గ్యాస్‌, రియల్టీ, పవర్‌, బ్యాంకింగ్‌ షేర్ల విలువ 6.05 శాతం మేర దిగజారాయి. మెటల్స్‌, మైనింగ్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైయ్యాయి. 

సెన్సెక్స్‌ టాప్‌10 నష్టాలు

ఇప్పటిదాకా సెన్సెక్స్‌ 12సార్లు వెయ్యి పాయింట్లకుపైగా నష్టపోయింది. ఇందులో 10సార్లు ఈ ఏడాదిలోనే కావడం  గమనార్హం. ఈ నష్టాలన్నీ కూడా కరోనా వైరస్‌ కారణంగానే.

    తేదీ                                                                                                                                                                                                                   నష్టం (పాయింట్లలో)

23-03-2020
3,934.72
12-03-2020
2,919.26
16-03-2020
2,713.41
04-05-2020
2,002.27
09-03-2020
1,941.67
18-03-2020
1,709.58
24-08-2015
1,624.51
28-02-2020
1,448.37
21-01-2008
1,408.35
21-12-2020
1,406.73


VIDEOS

logo