మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 11, 2020 , 23:39:40

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
  • సెన్సెక్స్‌ 237, నిఫ్టీ 76 పాయింట్లు వృద్ధి

ముంబై, ఫిబ్రవరి 11: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. వరుస రెండు రోజుల నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 236.52 పాయింట్లు లేదా 0.58 శాతం పుంజుకుని 41,216.14 వద్ద స్థిరపడగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 76.40 పాయింట్లు లేదా 0.64 శాతం అందుకుని 12,107.90 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభం నుంచీ లాభాల్లోనే కదలాడిన సూచీలు.. చివరిదాకా నష్టాలకు దూరంగానే పయనించాయి. అయితే ట్రేడింగ్‌ మొదట్లో కనిపించిన ఉత్సాహం.. ఆఖరుదాకా కొనసాగలేదు. దీంతో లాభాలు తగ్గిపోకతప్పలేదు. 


భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎస్‌, సన్‌ ఫార్మా షేర్లు 0.75 శాతం మేర కోల్పోవడం లాభాల్లో క్షీణతకు కారణంగా ఉన్నది. భారతీయ స్టాక్‌ మార్కెట్లపై కరోనా వైరస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. శుక్ర, సోమవారాల్లో నష్టాలు ఇందుకు నిదర్శనం. అయితే మంగళవారం మాత్రం మదుపరులు కొనుగోళ్లకే పెద్దపీట వేశారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, మారుతి సుజుకీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి భారీ షేర్లు మదుపరులను ఆకర్షించాయి. పవర్‌, మెటల్‌, బ్యాంకింగ్‌, ఎనర్జీ, హెల్త్‌కేర్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లు 1.68 శాతం చొప్పున పెరిగాయి. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్‌ సూచీలు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు లాభాల్లోనే కదలాడాయి. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుతున్న సంకేతాలు మార్కెట్లకు ఊపిరిలూదుతున్నాయని నిపుణులు ట్రేడింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు.


logo
>>>>>>