ఆదివారం 29 నవంబర్ 2020
Business - Oct 26, 2020 , 12:54:52

భారీ నష్టాల్లో మార్కెట్లు... ఇదే కారణం...?

 భారీ నష్టాల్లో మార్కెట్లు... ఇదే కారణం...?

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు(0.09 శాతం) నష్టపోయి 40,649.76 వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు(0.06 శాతం) కోల్పోయి 11,937.40 వద్ద ప్రారంభమైంది. కొటక్ మహీంద్రా బ్యాంకుతో చర్చల వార్తల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్స్ ఎగిశాయి. టెక్ మహీంద్ర షేర్లు 0.5 శాతం లాభపడ్డాయి. ఏడాది కాలంలో మహీంద్రా గ్రూప్ కంపెనీ ఆదాయం 3.32 శాతం, జూన్ క్వార్టర్‌తో 2.32 శాతం లభపడి రూ.9,371 కోట్లుగా ఉంది. మెటల్ సూచీలు 2 శాతం మేర, ఆటో సూచీ 1 శాతం మేర నష్టపోయింది.

మధ్యాహ్నం గం.12.23 సమయానికి సెన్సెక్స్ 376 (0.91%) పాయింట్లు క్షీణించి 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు(0.96 శాతం) కోల్పోయి 11,815 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి 73.74 వద్ద ట్రేడ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు పెరగడంతో ప్రభావం పడింది. శుక్రవారం 73.60 వద్ద క్లోజ్ అయింది. టాప్ గెయినర్స్ జాబితాలో HDFC లైఫ్, అదానీ పోర్ట్స్, నెస్ట్లే, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, హిండాల్కో, టాటా స్టీల్ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, టెక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

ఐటీ దిగ్గజం టీసీఎస్ వోల్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. టీసీఎస్ స్టాక్స్ ఆర శాతం మేర లాభపడింది. కొటక్ మహీంద్ర బ్యాంకు రెండో త్రైమాసికం ఫలితాలు దాదాపు 20 శాతం మేర క్షీణిస్తాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ స్టాక్ 1 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అయింది. కొటక్ మహీంద్ర బ్యాంకు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్ మూడు శాతానికి పైగా లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఏకంగా 2.43 శాతం మేర క్షీణించి రూ.2,061కి పడిపోయింది. నెస్ట్లే షేర్ ధర 0.23 శాతం లాభపడి రూ.106.56 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నెస్ట్లే ఇండియా నికర లాభం స్వల్పంగా 1.37 శాతం మేర క్షీణించింది. వేదాంత స్టాక్స్ 0.048 శాతం క్షీణించి 104.70 వద్ద ట్రేడ్ అయింది. జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఏకీకృత నికర లాభం 37 శాతం క్షీణించడంతో ఈ స్టాక్ నష్టాల్లో ట్రేడ్ అయింది. ఐసీఐసీఐ లాంబార్డ్ స్టాక్స్ 0.4 శాతం లాభపడ్డాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.