మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 27, 2020 , 00:36:47

ఆరు లక్షల కోట్లు ఆవిరి

ఆరు లక్షల కోట్లు ఆవిరి
  • నాలుగు రోజుల్లో 1,300 పాయింట్లు మటాష్‌
  • కల్లోలం సృష్టించిన కరోనా..40 వేల దిగువకు సూచీ

ముంబై, ఫిబ్రవరి 26: కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంకేతాలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా నాలుగోరోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రారంభం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు ఈ పతనానికి ఆజ్యంపోశాయి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు 40 వేల పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఒక దశలో 521 పాయింట్లకు పైగా పతనం చెందిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 392.24 పాయింట్లు పతనం చెంది 39,888.96 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 119.40 పాయింట్లు లేదా 1.01 శాతం కోల్పోయి 11,678.50 వద్ద పరిమితమైంది. 


ఈ నెల మూడు తర్వాత సూచీలకు ఇదే కనిష్ఠ స్థాయి. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 1,281.6 పాయింట్లు లేదా 3.11 శాతం, నిఫ్టీ 402.35 పాయింట్లు లేదా 3.33 శాతం చొప్పున పతనం చెందాయి. దీంతో మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గత నాలుగు రోజుల్లో వీరు రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్‌ఈలో లిైస్టెన కార్పొరేట్‌ సంస్థల మార్కెట్‌ విలువ అంతకంతకు పడిపోతున్నది. చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ ఇతర పొరుగు దేశాలకు పాకుతుండటంతో విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో మంగళవారం ఒకేరోజు దేశీయ ఈక్విటీ, డెబిట్‌ మార్కెట్ల నుంచి రూ.2,315 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 


వరుసగా ఐదు నెలలుగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..ఈ నెల మొదట్లో కూడా రూ.21 వేల కోట్లకు పైగా నిధులు కుమ్మరించారు. కానీ, కరోనా వైరస్‌తో అంతర్జాతీయంగా పరిస్థితులు తారుమారయ్యాయి. బుధవారం మార్కెట్లో సన్‌ఫార్మా భారీగా పతనం చెంది టాప్‌ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు మారుతి, ఎల్‌అండ్‌టీ, హీరో మోటోకార్ప్‌, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ల షేర్లు పతనం చెందగా..మరోవైపు ఎస్బీఐ, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌లు మాత్రం మదుపరులను ఆకట్టుకున్నాయి. 


logo
>>>>>>