బుధవారం 03 మార్చి 2021
Business - Jan 28, 2021 , 00:04:53

మార్కెట్లో అలజడి

మార్కెట్లో అలజడి

సెన్సెక్స్‌ 938, నిఫ్టీ 271 పాయింట్లు డౌన్‌

ముంబై, జనవరి 27: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. సార్వత్రిక బడ్జెట్‌ కంటే ముందు సూచీలు బేర్‌మన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు విదేశీ సంస్థాగత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దలాల్‌స్ట్రీట్‌లో అలజడి నెలకొన్నది. బ్యాంకింగ్‌, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో వరుసగా నాలుగో రోజు సూచీలు దిగువకు పడిపోయాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 48 వేల దిగువకు పడిపోగా, నిఫ్టీ 14 వేల పాయింట్ల కిందకు జారుకున్నది. ప్రారంభం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలు ఏ దశలోనూ కోలుకులేకపోయాయి. మధ్యాహ్నం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు పతనానికి ఆజ్యంపోశాయి. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 937.66 పాయింట్లు లేదా 1.94 శాతం కోల్పోయి 47,409.93 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 271.40 పాయింట్లు(1.91 శాతం) తగ్గి 13,967.50 వద్ద నిలిచింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ 2,382.19 పాయింట్లు(4.78 శాతం), నిఫ్టీ 677.20 పాయింట్లు(4.62 శాతం) నష్టపోయాయి. అమెరికా ఫెడ్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. 

4 రోజుల్లో 8 లక్షల కోట్లు ఆవిరి

నాలుగు రోజుల్లో మదుపరుల సంపద రూ.8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. స్టాక్‌మార్కెట్ల భారీ నష్టం పెట్టుబడిదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ 2,382.19 పాయింట్లు లేదా 4.78 శాతం పతనం చెందింది. దీంతో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.8,07,025.09 కోట్లు కరిగిపోయి రూ.1,89,63,547.48 కోట్లకు పరిమితమైంది. డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగియడంతో మదుపరులు ముందు జాగ్రత్తలో భాగంగా అమ్మకాలకు మొగ్గుచూపుతారని, కానీ వచ్చేవారంలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై పెట్టుబడిదారులు ఆందోళనతో ఉన్నట్లు కనిపిస్తున్నదని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి. 

VIDEOS

logo