ఆదివారం 31 మే 2020
Business - May 14, 2020 , 01:25:49

మిశ్రమ స్పందన

మిశ్రమ స్పందన

ఎంఎస్‌ఎంఈలకు ప్రకటించిన ఆర్థిక సాయం అమలుపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. పర్యవేక్షణ బాధ్యత కూడా రాష్ర్టాలకే ఉండాలి. ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంటే పూర్తి సార్థకత చేకూరుతుంది. ఆరోగ్య రంగానికి తొలి ప్రాధాన్యత దక్కితే బాగుండేది.

-వినోద్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు

ప్యాకేజీ అద్భుతం. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు మోదీ చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనం. 

-అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 

వలస కార్మికులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. 45 లక్షల ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే ఈ ప్యాకేజీ అనుకూలంగా ఉంది. రుణ ఎగవేత ఎంఎస్‌ఎంఈలకూ కొత్త రుణాలిస్తామనడాన్ని స్వాగతిస్తున్నాం. ఈక్విటీ కార్పస్‌ ఫండ్‌ బాగున్నా.. అది అమల్లోకి వస్తేగానీ చెప్పలేం.

- పీ చిదంబరం, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత 

ఆర్థిక ప్యాకేజీ వల్ల రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు. ఈ ప్యాకేజీ ఓ పెద్ద సున్నా. కరోనా సమయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే దీన్ని ప్రకటించారు.

-మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం

ప్యాకేజీ ఒక ప్రహసనంలా ఉన్నది. వలస కార్మికులకు ఎలాంటి స్వస్థత చేకూర్చలేదు.      

-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

ప్యాకేజీ వల్ల ఎంఎస్‌ఎంఈలకు పెద్దగా ప్రయోజనం లేదు. కొత్తగా ఎలాంటి గ్రాంట్‌లు ఇవ్వలేదు. అప్పులు ఇస్తామంటున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కోరుకున్నది ఇది కాదు. వడ్డీలు తగ్గిస్తే కొంత భారం తగ్గుతుంది.

-కే సుధీర్‌ రెడ్డి, టీఐఎఫ్‌ అధ్యక్షుడు 

ఈ ప్యాకేజీ అశించిన స్థాయిలో లేదు. నిరాశపర్చిందనే చెప్పవచ్చు. ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇస్తామన్నారు. మంచి నిర్ణయమే కానీ.. వ్యాపారమే జగరడంలేదు. కొనుగోలు శక్తి తగ్గింది. 

-మురళీధరన్‌, ఫిక్కీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు 

ఎలాంటి గ్యారంటీ లేకుండా ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వాలనే నిర్ణయం ద్వారా నిధుల లభ్యత పెరుగుతుంది. దీని ద్వారా కంపెనీల కార్యకలాపాలను పెంచవచ్చు. ఇక ఎమ్మెస్‌ఎంఈ నిర్వచనాన్ని మార్చాలని గత కొంత కాలంగా కోరుతున్నాం, ఇప్పుడు ప్రకటించారు. 

-కరుణేంద్ర జాస్తీ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు 

కేంద్రం ఎంఎస్‌ఎంఈ రంగానికి మంచి ప్యాకేజీని ప్రకటించింది. ఈ రంగానికి ఊరట లభిస్తుంది. ప్రధానంగా ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలనే నిర్ణయం ఉపయుక్తంగా ఉంటుంది. రూ.200 కోట్ల వరకు గ్లోబల్‌ టెండర్‌ లేకుండా స్థానిక ఎంఎస్‌ఎంఈలకు అవకాశం ఇవ్వాలి.

-కృష్ణా బోడనపు, సీఐఐ తెలంగాణ అధ్యక్షుడు

కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మెరుగ్గా ఉన్నాయి.

-మేకా విజయ్‌సాయి, తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు

రెరా గడువును తొమ్మిది నెలల దాకా పొడిగించుకునే అవకాశాన్ని కల్పించడం బాగుంది.

-ప్రభాకర్‌రావు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు

లాక్‌డౌన్‌తో నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతిన్నది. తాజా ప్రకటన కొనుగోలుదారులకు ధైర్యాన్నిస్తుంది.

-వీ రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి 


logo