గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 09, 2021 , 00:18:35

అగ్గువకే ఎస్బీఐ గృహ రుణాలు

అగ్గువకే ఎస్బీఐ గృహ రుణాలు

  • ఎస్బీఐ గృహ రుణాలు చౌక
  • వడ్డీ రేటులో 30 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ
  • మహిళలకు మరో 5 బేసిస్‌ పాయింట్లు అదనం 
  • ప్రాసెసింగ్‌ ఫీజు పూర్తిగా మాఫీ 

ముంబై, జనవరి 8: గృహ రుణాలు తీసుకునేవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తీపికబురు అందించింది. వడ్డీ రేటులో 30 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఆ బ్యాంక్‌ ప్రకటించింది. అంతేకాకుండా ఈ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త గృహ రుణాలపై వడ్డీ రేటును సిబిల్‌ స్కోరు ఆధారంగా నిర్ణయించనున్నట్లు స్పష్టం చేసింది. రూ.30 లక్షల్లోపు గృహ రుణాల వడ్డీ రేటు 6.80 శాతం నుంచి, రూ.30 లక్షలకు మించిన గృహ రుణాల వడ్డీ రేటు 6.95 శాతం నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. మహిళా కస్టమర్లకు ఈ వడ్డీ రేటులో అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఇండ్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందించాలన్న ధ్యేయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో మార్చి నెలాఖరు వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని, రూ.5 కోట్లలోపు గృహ రుణాలపై వడ్డీ రేటులో 30 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ ఇస్తామని పేర్కొన్నది. ‘యోనో’ యాప్‌ ద్వారా కస్టమర్లు తమ ఇంటి నుంచే గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇలాంటి వారికి కూడా వడ్డీ రేటులో అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ లభిస్తుందని ఎస్బీఐ స్పష్టం చేసింది.

VIDEOS

logo