బుధవారం 27 మే 2020
Business - May 24, 2020 , 00:12:25

జర భద్రం

జర భద్రం

  • రేపట్నుంచి మళ్లీ విమానయానం మొదలు
  • వైరస్‌ లక్షణాలుంటే వెనక్కే  
  • ఎయిర్‌ హోస్టెస్‌లకు పీపీఈ కిట్లు అడుగడుగునా శానిటైజింగ్‌: ఏఏఐ

కరోనా కారణంగా రెండు నెలలపాటు స్తంభించిన దేశీయ విమానయాన సేవలు ఎట్టకేలకు మళ్లీ మొదలవుతున్నాయి. 

రోజురోజుకూ వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ.. సోమవారం (ఈ నెల 25) నుంచి ఎయిర్‌లైన్స్‌ ఎగిరేందుకు మోదీ సర్కారు పచ్చజెండా ఊపింది.

ఏమరుపాటుగా ఉంటే మహమ్మారితో ముప్పేనని హెచ్చరిస్తున్న ఎయిర్‌పోర్ట్స్‌  అథారిటీ..  ప్రయాణికుల రక్షణార్థం  పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా ధాటికి కుప్పకూలిన భారతీయ విమానయాన రంగం.. మళ్లీ రెక్కలు విప్పుతోంది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి ఈ సర్వీసుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తల నడుమ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సిద్ధమైంది. ప్రయాణికుల నుంచి ప్రయాణికులకు, సిబ్బందికి వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలకు ప్రాధాన్యమిస్తామని ఏఏఐ వెల్లడించింది. ప్రయాణికులు తప్పక నిబంధనలు పాటించాలని, అప్పుడే విమానం ఎక్కేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.


మాస్కులతో రావాలి 

నిబంధనల ప్రకారం, ప్రయాణికులు రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఏఏఐ సూచించింది. ప్రయాణికులు 20 కిలోల వరకు లగేజీని మాత్రమే వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. ప్రవేశ మార్గాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి కొవిడ్‌-19 లక్షణాలు లేనివారినే లోపలికి అనుమతిస్తామని తెలిపింది. దీంతోపాటు ఆరోగ్య పరిస్థితిపై స్వీయ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఆరోగ్య సేతు యాప్‌ ప్రధానం

ప్రతి ప్రయాణికుడి సెల్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం తప్పనిసరి చేస్తూ ఏఏఐ నిర్ణయం తీసుకున్నది. విమానాశ్రయంలో భౌతిక దూరాన్ని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నది. ఇక ప్రయాణికులకు ప్రతి చోట శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతోపాటు విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికుల లగేజీని పూర్తిస్థాయిలో శానిటైజింగ్‌ చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం బోర్డింగ్‌ పాస్‌ కియోస్క్‌ల సంఖ్య పెంచనున్నారు. విమానాశ్రయ సిబ్బందితోపాటు ఎయిర్‌ హోస్టెస్‌లు పీపీఈ కిట్లు ధరించి సేవలందించేలా చర్యలు తీసుకున్నట్టు ఏఏఐ స్పష్టం చేసింది.

సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిది కీలక బాధ్యత

ప్రస్తుత కష్టకాలంలో తమ సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వహించనున్నారని సీఐఎస్‌ఎఫ్‌ ఎయిర్‌పోర్టు సెక్టార్‌-2 ఐజీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రయాణికులకు, సిబ్బందికి కరోనా వైరస్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో ప్రయాణికులు తమ సిబ్బందికి సహకరిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.


logo