గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 02, 2020 , 01:12:35

డిజిన్వెస్ట్‌మెంట్‌ రూ.2.10 లక్షల కోట్లు

డిజిన్వెస్ట్‌మెంట్‌ రూ.2.10 లక్షల కోట్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.2.10 లక్షల కోట్ల నిధులను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఐపీవోకి రానున్న బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలను విక్రయించడం కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం ఈ రెండు కంపెనీల నుంచి సమకూరనున్నది. వీటితోపాటు ఇంధన విక్రయ సంస్థ బీపీసీఎల్‌, కంకార్‌ అండ్‌ షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటాలను మరికొద్ది నెలల్లో విక్రయించనున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌...వచ్చే కొన్ని నెలల్లో ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.  2019-20లో రూ.1.05 లక్షల కోట్లు సేకరించాలనుకున్నప్పటికీ ఈ లక్ష్యానికి చేరుకునే అవకాశాలేమి కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే సేకరించింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక ఇనిస్టిట్యూట్‌లలో వాటాల విక్రయం ద్వారా రూ.90 వేల కోట్లు సేకరించాలని సంకల్పించింది. 


వచ్చే ఏడాదిలో బీమా దిగ్గజం ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి ఉన్న కొంత వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించిన కేంద్రం..ఐడీబీఐ బ్యాంకులో ఉన్న వాటాను సైతం అమ్మకానికి పెట్టబోతున్నది. బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి గత కొన్నేండ్లుగా కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలు ఊతమిచ్చాయి. ఐడీబీఐ బ్యాంకుల్లో కేంద్రానికి 47.11 శాతం వాటా ఉండగా, ఎల్‌ఐసీకి 51 శాతం వాటా ఉన్నది. బ్యాంకులో కేంద్రానికి ఉన్న వాటాను ఎల్‌ఐసీకి విక్రయించడానికి గతేడాది ఆగస్టులోనే కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 2016-17లోనూ డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యానికి చేరుకోలేక పోయింది. రూ.56,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా..దీంట్లో రూ.46,247 కోట్లు సేకరించగలిగింది. రెండేండ్ల తర్వాత మళ్లీ 2019-20లో లక్ష్యానికి చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. 2017-18లో మాత్రం లక్ష కోట్ల రూపాయలకు బదులుగా రూ.1,00,056 కోట్లు, 2018-19లో రూ.80 వేల కోట్ల కంటే రూ.84,972 కోట్లు సేకరించగలిగింది. 


logo
>>>>>>