శనివారం 30 మే 2020
Business - Feb 15, 2020 , 00:11:34

స్పైస్‌జెట్‌ లాభం రూ.73 కోట్లు

స్పైస్‌జెట్‌ లాభం రూ.73 కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.73.2 కోట్ల నికర లాభం వచ్చినట్లు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలోనూ సంస్థ రూ.55.1 కోట్ల లాభాన్ని గడించింది. 2018-19 ఏడాది మూడో త్రైమాసికంలో రూ.2,468.80 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికిగాను 47 శాతం ఎగబాకి రూ.3,647.10 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో మ్యాక్స్‌ విమానాలు నేలపట్టునే నిలిచిపోయినప్పటికీ లాభాలను ఆర్జించినట్లు స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. 


గతేడాది ప్రపంచవ్యాప్తంగా రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలిపోవడంతో ఈ మ్యాక్స్‌ విమానాలను నేలపట్టునే నిలిపివేశాయి విమానయాన సంస్థలు. కానీ, జనవరి నుంచి మ్యాక్స్‌ విమాన సర్వీసులను ప్రారంభించాలనుకున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఇవి నేలపట్టునే ఉండిపోవడంతో సంస్థపై అదనపు భారం పడుతున్నదని, ముఖ్యంగా గ్రౌండింగ్‌, ఇతర ఖర్చులు అధికమవుతున్నాయన్నారు. మ్యాక్స్‌ విమానాలను కేవలం స్పైస్‌జెట్‌ మాత్రమే వినియోగిస్తుండటంతో గతేడాది మార్చి నుంచి 13 సర్వీసులు పలు విమానాశ్రయాల్లో ఉన్నాయి. 


logo