సోమవారం 30 మార్చి 2020
Business - Mar 14, 2020 , 00:23:56

హైదరాబాద్‌లో స్పైస్‌జెట్‌ కేంద్రం

హైదరాబాద్‌లో స్పైస్‌జెట్‌ కేంద్రం
  • జీఎమ్మార్‌ ఏవియేషన్‌ సెజ్‌తో ఒప్పందం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎమ్మార్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో స్పైస్‌జెట్‌ తమ వేర్‌హౌస్‌ను, వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నది. ఈ మేరకు జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఏవియేషన్‌ సెజ్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఎస్‌ఎల్‌)తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నట్టు స్పైస్‌జెట్‌ శుక్రవారం ప్రకటించింది. తొలుత 33 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నామని, ఆ తర్వాత డిమాండ్‌ను బట్టి దీన్ని లక్ష చదరపు అడుగులకు విస్తరిస్తామని స్పైస్‌జెట్‌ సంస్థ వెల్లడించింది. వేర్‌హౌస్‌, వాణిజ్యకేంద్రం ఏర్పాటుతో కార్గో పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడంతోపాటు తెలంగాణలోని ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఏరోస్పేస్‌, రక్షణ, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ఎగుమతులు, దిగుమతులకు మరింత ఊతం లభిస్తునందని జీఎమ్మార్‌, స్పైస్‌జెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని భారతీయ మార్కెట్‌ అవసరాలను తీర్చేందుకు డొమెస్టిక్‌ టారిఫ్‌ ఏరియాలో స్థలం అవసరమైన సంస్థలకు రెడీ టు యూజ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను జీఎమ్మార్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ అందిస్తున్నది. ఎయిర్‌పోర్టు బేస్డ్‌ ఫ్రీజోన్‌ నిర్మాణం కోసం జీహెచ్‌ఏఎస్‌ఎల్‌తో ప్రతిష్ఠాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకొన్నందుకు ఎంతో గర్వపడుతున్నామని స్పైస్‌జెట్‌ సంస్థ సీఈఓ అమన్‌కపూర్‌ తెలిపారు. కార్గో పరిశ్రమకు ఈ ఒప్పందం చాలా మేలు చేస్తుందని స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. 


logo