మంగళవారం 24 నవంబర్ 2020
Business - Oct 30, 2020 , 00:43:23

రూ.1.75 లక్షల కోట్లు రావాలి

రూ.1.75 లక్షల కోట్లు రావాలి

  • టాటాలతో తెగదెంపులపై సుప్రీంకు ఎస్పీ గ్రూపు నివేదన

ముంబై: టాటా గ్రూపుతో ఏడు దశాబ్దాల బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని నిశ్చయించుకున్న షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపు సంబంధిత ఆస్తులు, వాటాల విభజన ప్రణాళికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. టాటా గ్రూపు సంస్థల్లో తమకు రూ.1.75 లక్షల కోట్ల విలువైన వాటాలున్నట్టు తెలిపింది. 2016 అక్టోబర్‌ 28న సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ పదవి నుంచి తొలగించడంతో ఈ రెండు గ్రూపుల మధ్య న్యాయ పోరాటం మొదలైంది. టాటా గ్రూపులో టాటా ట్రస్టులు, టాటా కంపెనీలు, టాటా కుటుంబ సభ్యులకు 81.6 శాతం, మిస్త్రీ కుటుంబానికి 18.37 శాతం వాటా ఉన్నట్టు సుప్రీం కోర్టుకు తెలిపామని ఎస్పీ గ్రూపు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఈ వాటాలకు విలువ కట్టడంపై నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు లిస్టెడ్‌ ఆస్తులను, బ్రాండ్‌ వాటాను దామాషా ప్రకారం విభజించాలని.. అన్‌లిస్టెడ్‌ ఆస్తులకు తటస్థ థర్డ్‌పార్టీతో విలువ కట్టించి నికర అప్పులకు సర్దుబాటు చేయాలని ఎస్పీ గ్రూపు సూచించింది. అలాగే ప్రస్తుతం టాటా సన్స్‌కు వాటాలున్న లిస్టెడ్‌ టాటా సంస్థల్లో తమకు నాన్‌-క్యాష్‌ సెటిల్మెంట్‌ కింద దామాషా ప్రకారం వాటాలు ఇవ్వాలని కోరింది.