గురువారం 28 మే 2020
Business - May 07, 2020 , 02:00:37

బండికదిలింది

బండికదిలింది

  • ఆటో రంగంలో మొదలైన ఉత్పత్తి
  • టీవీఎస్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, బెంజ్‌ షురూ
  • 2 నుంచి మారుతీ ప్లాంట్‌లో తయారీ 
  • ఇసుజు ఏపీ ప్లాంట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ/చెన్నై/ముంబై, మే 6: లాక్‌డౌన్‌ కారణంగా మూతబడిన పరిశ్రమలు ఎట్టకేలకు తెరుచుకుంటున్నాయి. బుధవారం పలు ఆటో రంగ సంస్థలు తమ ప్లాంట్లలో ఉత్పత్తిని ప్రారంభించాయి. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి నియంత్రణ కోసం ఇప్పటిదాకా లాక్‌డౌన్‌ను రెండుసార్లు పొడిగించగా, ఈ నెల 17దాకా అమలు కానున్న సంగతీ విదితమే. అయితే ఇటీవలి పొడిగింపు సందర్భంగా వివిధ ఆంక్షలని కేంద్రం సడలించింది. దీంతో దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటర్‌ దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని ఆరంభించింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌తోపాటు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఒక్కో ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించాయి. ‘హోసూర్‌, మైసూరు, నలగఢ్‌లలోని అన్ని కర్మాగారాల్లో ఉత్పత్తి మొదలైంది’ అని ఓ ప్రకటనలో టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ మార్గదర్శకాల దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తున్నారని తెలిపింది. ఉద్యోగుల భద్రత కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ తీసుకుంటున్నట్లు చెప్పింది. పుణె దగ్గర్లోని చకాన్‌ ప్లాంట్‌లో బెంజ్‌ కార్ల ఉత్పత్తి మొదలవగా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సైతం చెన్నై సమీపంలోని ఒరగదమ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని ఆరంభించింది. పరిమిత స్థాయి కార్మికులతో వాహన తయారీని చేపట్టింది. అయితే తిరువొట్టియూర్‌, వల్లమ్‌ వడగల్‌ కర్మాగారాల్లో మాత్రం దశలవారీగా ఉత్పత్తిని మొదలు పెడుతామని ఓ ప్రకటనలో తెలియజేసింది. మార్చి 23 నుంచి తయారీని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఆపేసింది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 120 డీలర్‌షిప్‌లు పాక్షికంగా పనిచేస్తున్నాయి. 

సిద్ధమవుతున్న మారుతీ 

దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఈ నెల 12 నుంచి మనేసర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తున్నది. నిజానికి గత నెల 22నే ఇక్కడ ఉత్పత్తికి హర్యానా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే దేశవ్యాప్త లాక్‌డౌన్‌, స్తంభించిన మార్కెట్‌ దృష్ట్యా ఉత్పత్తిని ప్రారంభించలేదు. హర్యానాలో మనేసర్‌తోపాటు గుర్గావ్‌లో మారుతీకి ప్లాంట్లున్నాయి. ఈ రెండింటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15.5 లక్షల యూనిట్లు. మార్చి 22 నుంచి ఇవి మూతబడ్డాయి. గుజరాత్‌లోనూ ఈ సంస్థకు ఓ ప్లాంట్‌ ఉన్నది. కాగా, దేశవ్యాప్తంగా 600 ఔట్‌లెట్లను తెరిచింది.

కదలని హోండా, హ్యుందాయ్‌

హోండా కార్స్‌కు ప్లాంట్ల పునఃప్రారంభానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్మికుల కొరత కనిపిస్తున్నది. అయితే వచ్చే వారం నుంచి రాజస్థాన్‌లోని తపుకర ప్లాంట్‌లో ఉత్పత్తిని మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక స్థానిక అధికారుల నుంచి ఆమోదం లభిస్తే గ్రేటర్‌ నోయిడా ప్లాంట్‌ ప్రారంభం అవుతుందని చెప్పింది. హ్యుం దాయ్‌ మాత్రం ఉత్పత్తి ఆరంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలోగల ఉత్పత్తి కేంద్రం ఆరంభానికి స్థానిక అధికారుల నుంచి అనుమతి లభించినట్లు ఇసుజు మోటర్స్‌ ప్రకటించింది. వీలైనంత త్వరలో మొదలు పెడతామని చెప్పింది.

తెరుచుకున్న ట్రాక్టర్‌ విక్రయ కేంద్రాలు 

దేశవ్యాప్తంగా దాదాపు 50 శాతం ట్రాక్టర్‌ డీలర్‌షిప్‌లు తెరుచుకున్నాయి. చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి ఉండటం, లాక్‌డౌన్‌ ఆంక్షలు పెద్దగా లేకపోవడంతో సగం విక్రయ కేంద్రాలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయ రంగ కార్యకలాపాలు ఊపందుకుంటున్న క్రమంలో ట్రాక్టర్‌ డీలర్‌షిప్‌లు తిరిగి తెరుచుకోవడం పట్ల అటు వ్యాపారుల్లో, ఇటు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. మరోవైపు ఎంఆర్‌ఎఫ్‌ టైర్ల తయారీ కూడా మొదలైంది. అయితే లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు, స్థానిక అధికారుల సూచనలకు అనుగుణంగా పాక్షికంగానే ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలియజేసింది.


logo