ఆదివారం 29 నవంబర్ 2020
Business - Oct 27, 2020 , 02:24:45

అంబానీ-బియానీ డీల్‌కు బ్రేక్‌

అంబానీ-బియానీ డీల్‌కు బ్రేక్‌

  • రిలయన్స్‌-ఫ్యూచర్‌ ఒప్పందంపై సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ స్టే
  • అమెజాన్‌కు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26: ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌కు భారీ ఊరట లభించింది. ఫ్యూచర్‌ గ్రూపును కొనుగోలు చేసేందుకు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) కుదుర్చుకున్న ఒప్పందంపై సింగపూర్‌కు చెందిన ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ స్టే విధించింది. ఈ ఒప్పందాన్ని సవాలుచేస్తూ అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ ఒప్పందంపై ముందుకు వెళ్లవద్దని ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ ఆదేశించింది. కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు ఆర్‌ఐఎల్‌ రూ.24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఏడాది ఆగస్టులో కుదిరిన ఈ ఒప్పందం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని అమెజాన్‌ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ స్టే విధించింది. ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 49 శాతం పెట్టుబడులు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఒప్పందం ప్రకారం 3 నుంచి 10 ఏండ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు లభించింది. అయితే ఆగస్టులో ఆర్‌ఐఎల్‌-ఫ్యూచర్‌ గ్రూపు మధ్య కుదిరిన ఒప్పందం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నదని అమెజాన్‌ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయమై అమెజాన్‌ ఈ నెల ఆరంభంలో ఫ్యూచర్‌ గ్రూపునకు నోటీసులు పంపడంతోపాటు మరోవైపు సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆర్‌ఐఎల్‌-ఫ్యూచర్‌ గ్రూపు ఒప్పందంపై ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ స్టే విధించింది. ఈ విషయాన్ని అమెజాన్‌ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి ధ్రువీకరించారు. రిలయన్స్‌-ఫ్యూచర్‌ ఒప్పందం విషయంలో తమకు ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ ఎంతో ఊరట కల్పించిందని ఆయన పేర్కొంటూ.. ఈ ఆర్బిట్రేషన్‌ ప్రక్రియకు త్వరగా ముగింపు లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఈ స్టే 90 రోజులపాటు అమల్లో ఉంటుంది. సాధారణంగా భారత చట్టాలు ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను పరిగణనలోకి తీసుకోవు. అయినప్పటికీ వ్యాపార సంస్థలు మాత్రం ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను పాటిస్తూ ఉంటాయి.

స్టేని సవాలు చేస్తాం: ఎఫ్‌ఆర్‌ఎల్‌

సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ ఆదేశాన్ని సవాలు చేయనున్నట్టు ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) సంకేతాలిచ్చింది. ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ విచారణ జరుపువతున్న ఒప్పందంలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ భాగస్వామిగా లేదని ఫ్యూచర్‌ గ్రూపు స్పష్టం చేసింది. ‘న్యాయ సలహాలు తీసుకున్నాకేఆర్‌ఆర్‌వీఎల్‌తో ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ఈ విషయంలో సంబంధిత నిబంధనలన్నింటినీ పాటించాం. ఈ ఒప్పందాలన్నీ భారతీయ చట్టానికి, ఇండియన్‌ ఆర్బిట్రేషన్‌ యాక్ట్‌కు లోబడి కుదుర్చుకున్నవే’ అని ఎఫ్‌ఆర్‌ఎల్‌ వివరించింది. 

 ముందుకే వెళ్తాం: ఆర్‌ఆర్‌వీఎల్‌

ఆర్బిట్రేషన్‌ ప్యానల్‌ ఆదేశంపై రిలయన్స్‌ కూడా స్పందించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలను, ఆస్తులను కొనుగోలు చేసేందుకు దేశీయ చట్టాలకు అనుగుణంగానే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తామని రిల యన్స్‌ స్పష్టం చేసింది.