బుధవారం 21 అక్టోబర్ 2020
Business - Sep 10, 2020 , 02:04:50

పెట్టుబడుల జోష్‌

పెట్టుబడుల జోష్‌

  • రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో సిల్వర్‌ లేక్‌ రూ.7,500 కోట్ల పెట్టుబడి
  • 1.75% వాటా కొనుగోలుకు ఒప్పందం  l 4.21 లక్షల కోట్లుగా సంస్థ విలువ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో పెట్టుబడి పెట్టేందుకు అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ సిద్ధమైంది. ఇప్పటికే రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.10,202.55 కోట్ల పెట్టుబడి పెట్టిన సిల్వర్‌ లేక్‌.. ఇప్పుడు మరో రూ.7,500 కోట్లు వెచ్చించి ఆర్‌ఆర్‌వీఎల్‌లో 1.75 శాతం వాటా కొనుగోలు చేయనున్నది. ఈ పెట్టుబడితో ఆర్‌ఆర్‌వీఎల్‌ ఈక్విటీ విలువ రూ.4.21 లక్షల కోట్లకు చేరుతుందని రిలయన్స్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జియో ప్లాట్‌ఫామ్స్‌లో పలు ప్రముఖ సంస్థలకు వాటాలను విక్రయించిన ఆర్‌ఐఎల్‌.. ఇప్పుడు రిటైల్‌ వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా 10 శాతం వాటాలను విక్రయించేందుకు సిద్ధమైంది. దేశీయ రిటైల్‌ వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న ఆర్‌ఆర్‌వీఎల్‌.. ప్రస్తుతం దాదాపు 7 వేల పట్టణాల్లో 12 వేల వరకు స్టోర్లను నడుపుతూ సుమారు 64 కోట్ల మందికి సేవలందిస్తున్నది. 

జియో 10 కోట్ల చౌక స్మార్ట్‌ఫోన్లు

తక్కువ ధరతో కూడిన 10 కోట్లకుపైగా స్మార్ట్‌ఫోన్లను తయారు చేసేందుకు జియో సిద్ధమవుతున్నది. ఇంటర్నెట్‌ డాటా ప్యాక్‌లతో కలిపి వీటిని డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్టు సమాచారం. గూగుల్‌తో కలిసి 4జీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించనున్నట్టు తెలుస్తున్నది. 


సిల్వర్‌ లేక్‌ బాటలో కేకేఆర్‌

మరోవైపు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో అమెరికాకే చెందిన కేకేఆర్‌ సంస్థ కూడా పెట్టుబడి పెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇరు పక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగినట్టు సమాచారం. దాదాపు రూ.11,023 కోట్లతో వాటా కొనుగోలు చేయాలని కేకేఆర్‌ భావిస్తున్నదని, దీనిపై ఈ నెలలోనే ప్రకటన వెలువడవచ్చని తెలుస్తున్నది.


logo