సోమవారం 06 జూలై 2020
Business - Jun 30, 2020 , 00:25:41

జాబ్‌ గ్యారంటీ

జాబ్‌ గ్యారంటీ

  • పారిశ్రామిక వాడల్లో ఉద్యోగుల కొరత
  • స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు
  • లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులు
  • పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో 10 వేల సిబ్బంది అవసరం

లాక్‌డౌన్లతో మూతబడిన పరిశ్రమలు మళ్లీ తెరుచుకున్నాయి. కానీ ఇప్పుడు కార్మికుల కొరత వేధిస్తున్నది. ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్న కంపెనీలు ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. హైదరాబాద్‌ పరిసరాల్లోని పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున ‘వాంటెడ్‌' బోర్డులు దర్శనమిస్తున్నాయి. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. ఒక్క పటాన్‌చెరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోనే 10 వేల సిబ్బంది అవసరమని అక్కడి సంస్థలు చెప్తున్నాయి.

పటాన్‌చెరు: కొవిడ్‌-19 కారణంగా మూతబడిన పరిశ్రమలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఫార్మా, ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో ఆర్డర్లు పూర్తిచేసేందుకు సరిపోను సిబ్బంది, మానవ వనరులు కరువయ్యాయి. ఒక్క పటాన్‌చెరు నియోజకవర్గంలోనే దాదాపు 10 వేల మందికి ప్రాథమిక స్థాయి ఖాళీలు ఏర్పడ్డాయి. పదవ తరగతి, ఇంటర్మిడియట్‌, ఎలాంటి విద్యార్హత లేని వారికి తక్షణం ఉపాధి లభించే అవకాశాలున్నాయి. కరోనా మహమ్మారికి భయపడి పనులకు రానివారితో, సొంతూళ్లకు తరలివెళ్లిన వారితో భారీగా ఉద్యోగుల కొరత తలెత్తింది. ఉత్తరాది రాష్ర్టాలకు వెళ్లిన కార్మికులను వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో పటాన్‌చెరు, పాశమైలారం, ఖాజీపల్లి, బొల్లారం, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో కార్మికుల అవసరం అధికంగా కనిపిస్తున్నది. పాశమైలారం పారిశ్రామిక వాడలో వాట్సప్‌ ద్వారా ఉపాధి కోసం ఐలా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

నిజానికి ఈ ఏడాది మార్చి ప్రథమార్ధం వరకు పారిశ్రామిక వాడల్లో పరిస్థితి అంతా సజావుగానే ఉండేది. ద్వితీయార్ధం నుంచే పరిస్థితి తలకిందులైంది. వైరస్‌ వ్యాపించకుండా విధించిన లాక్‌డౌన్‌తో చాలా మంది కార్మికులు తమ స్వరాష్ర్టాలకు వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు దాదాపుగా అన్ని రకాల పరిశ్రమల్లోనూ కార్మికులు, హెల్పర్ల కొరత వేధిస్తున్నది. సెమీ స్కిల్డ్‌, స్కిల్డ్‌ కార్మికులు, కాస్త చదువుకున్న వారుంటే శిక్షణ ఇచ్చి వారితో ఉత్పత్తులు తీసే అవకాశం ఉంది. ఇది స్థానిక యువతకు కలిసి వచ్చే అంశంగా మారింది. 


కార్మికులు, హెల్పర్లకు డిమాండ్‌

పరిశ్రమల్లో చిరు స్థాయి ఉద్యోగులు, కార్మికులు, హెల్పర్లకు అధిక డిమాండ్‌ కనిపిస్తున్నది. అనేక పరిశ్రమల గేట్లకు వాంటెడ్‌ వర్కర్స్‌ అంటూ ప్రకటనలు కనిపిస్తున్నాయి. గతంలో స్థానికులంటే పెద్దగా ఆసక్తి చూపించని పరిశ్రమలు సైతం ఎవరు వచ్చినా ఉపాధి ఇస్తాం అంటున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలోని పాశమైలారంలో దాదాపుగా 3 వేల మంది హెల్పర్లకు, గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలో దాదాపు 4 వేల మందికి, బొల్లారంలో 2 వేల మందికి, పటాన్‌చెరులో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలున్నాయి. మొత్తంగా దాదాపు 10 వేల మందికి పటాన్‌చెరు ఐడీఏల్లో తక్షణం ఉపాధి లభించనున్నది. 

‘పాశమైలారం పారిశ్రామిక వాడలో తక్షణం 3 వేల మంది కార్మికులు కావాలి. ఫార్మా పరిశ్రమల్లో ఆర్డర్లు పూర్తి చేసేందుకు ఎవరు వచ్చినా ఉద్యోగం ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం. ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లోను ఖాళీలున్నాయి. యువత, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగార్థులు వాట్సప్‌ నెంబర్‌ 99486 86478కు మెసెజ్‌ ఇవ్వండి’

- పాశమైలారం ఐలా చైర్మన్‌ చందుకుమార్‌ పొట్టి

‘ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో 4 వేల మంది కార్మికులు, హెల్పర్ల అవసరం ఉన్నది. యూపీ, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌  కార్మికులు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు వారు స్వస్థలాలకు వెళ్లడంతో అడ్డా కూలీలతోనే పనులు చేయించుకుంటున్నాం. మా పారిశ్రామిక వాడల్లో పనిచేసేందుకు వస్తే ఉపాధి కల్పిస్తాం’

- ఖాజీపల్లి, గడ్డపోతారం పరిశ్రమల సంఘం ప్రతినిధి శేఖర్‌


logo