సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 18, 2020 , 02:59:57

రోష్నీకే పట్టం

రోష్నీకే పట్టం

న్యూఢిల్లీ, జూలై 17: దేశీయ ఐటీ సేవల దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ యాజమాన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్‌ నాడార్‌ చైర్మన్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ స్థానంలో ఆయన వారసురాలు రోష్నీ నాడార్‌ మల్హోత్రా నియమితులయ్యారు. దేశీయ మహిళా సంపన్నురాలైన రోష్నీ.. 9.9 బిలియన్‌ డాలర్ల విలువైన సంస్థకు అధిపతిగా శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు. స్టాక్‌ మార్కెట్లో లిైస్టెన దేశీయ ఐటీ సంస్థకు అతి పిన్న వయస్సురాలైన (38 ఏండ్లు) మహిళ సారథ్యం వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. క్లాసికల్‌ మ్యూజీషియన్‌ శిక్షకురాలైన ఆమె.. 2013 లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ బోర్డు డైరెక్టర్‌గాను, ఆ తర్వాతి క్రమంలో వైస్‌ చైర్మన్‌గా పదొన్నతి పొందారు. అయినప్పటికీ హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈవోగా ఆమెనే కొనసాగనున్నారు. మరోవైపు శివ్‌ నాడార్‌ చైర్మన్‌ నుంచి వైదొలిగినప్పటికీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గాను, ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. 

  • చదువు: కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు
  • హోదా: హెచ్‌సీఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్‌పర్సన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ట్రస్టీ ఎండీ, సీఈవో, శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ అధినేత
  • కుటుంబం: భర్త శిఖర్‌ మల్హోత్రా, ఇద్దరు పిల్లలు
  • తల్లిదండ్రులు: శివ్‌ నాడార్‌, కిరణ్‌ నాడార్‌
  • సంపద: రూ.36,800 కోట్లు
  • శక్తివంతమైన ఫోర్బ్స్‌ 500 శక్తివంతమైన జాబి
  • మహిళ: తాలో 54వ స్థానంలో ఉన్నారు.

లాభాల్లో భారీ వృద్ధి

ఆర్థిక ఫలితాల్లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ అదరహో అనిపించింది. జూన్‌ 2020తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,925 కోట్ల లాభాన్ని ఆర్జించింది. వార్షిక ప్రతిపాదికన లాభంలో 31.7 శాతం వృద్ధిని సాధించింది. గత త్రైమాసికంలో భారీ ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వచ్చే త్రైమాసికాల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగనున్నదని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈవో విజయకుమార్‌ తెలిపారు.  మొత్తం ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.17,841 కోట్లను తాకింది.  ఏడాది క్రితం ఇది రూ.16,425 కోట్లుగా ఉన్నది. ఈ ఏడాది మిగతా మూడు త్రైమాసికాల్లో ఆదాయం 1.5-2.5 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకోవచ్చని అవుట్‌లుక్‌లో ఆయన పేర్కొన్నారు. హెచ్‌1-బీ వీసాను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తమ సంస్థపై స్వల్పంగా ప్రభావం చూపనున్నదన్నారు. ప్రతిషేరుకు రూ.2 డివిడెండ్‌ను ప్రకటించింది సంస్థ. 

వేతన పెంపు లేవు..

కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు పెంచడం లేదని హెచ్‌సీఎల్‌ స్పష్టంచేసింది. నియామకాలు కొనసాగుతాయని ప్రకటించినప్పటికీ ఎంత మందిని తీసుకునేదీ వెల్లడించలేదు. జూన్‌ చివరి నాటికి 7 వేల మంది చేరడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,50,287కి చేరుకున్నది. వీరిలో 96 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తుండగా, మిగతా సిబ్బంది కంపెనీ కార్యాలయాల్లోనూ లేదా క్లయింట్ల వద్ద ఉండి విధులు నిర్వహిస్తున్నారు. హెచ్‌సీఎల్‌ షేరు విలువ శుక్రవారం స్వల్పంగా పెరిగి రూ.631 వద్ద ముగిసింది.


logo