సోమవారం 26 అక్టోబర్ 2020
Business - Sep 09, 2020 , 02:33:38

అమెరికాలోని టాప్‌-400 శ్రీమంతుల్లో ఏడుగురు ఇండో అమెరికన్లు

అమెరికాలోని టాప్‌-400 శ్రీమంతుల్లో ఏడుగురు ఇండో అమెరికన్లు

న్యూయార్క్‌: అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో ఈ ఏడాది ‘ఫోర్బ్స్‌' పత్రిక రూపొందించిన జాబితాలో ఏడుగురు ఇండో-అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘జడ్‌స్కాలర్‌' సీఈవో జయ్‌ చౌదరి 6.9 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో 85వ స్థానంలో నిలువగా.. సింఫనీ టెక్నాలజీ గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ రొమేశ్‌ వాధ్వానీ (3.4 బిలియన్‌ డాలర్లు) 238వ స్థానంలో ఉన్నారు. ఆన్‌లైన్‌ హోం గూడ్స్‌ రిటైలర్‌ ‘వేఫెయిర్‌' సహ వ్యవస్థాపకుడు, సీఈవో నీరజ్‌ షా (2.8 బిలియన్‌ డాలర్లు) 299వ స్థానంలో, సిలికాన్‌ వ్యాలీ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ‘ఖోస్లా వెంచర్స్‌' వ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా (2.4 బిలియన్‌ డాలర్లు) 353వ స్థానంలో నిలిచారు. ‘షేర్పాలో వెంచర్స్‌' సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కవిత్రక్‌ రామ్‌ శ్రీరామ్‌ (2.3 బిలియన్‌ డాలర్లు)తోపాటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మాతృ సంస్థ ‘ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌'కు చెందిన రాకేశ్‌ గంగ్వాల్‌ (2.3 బిలియన్‌ డాలర్లు), బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘వర్క్‌డే’ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అనీల్‌ భుస్రీ (2.3 బిలియన్‌ డాలర్లు) 359వ స్థానాన్ని దక్కించుకున్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (179 బిలియన్‌ డాలర్లు) ఈ జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. బిల్‌ గేట్స్‌ (111 బిలియన్‌ డాలర్లు) ద్వితీయ స్థానంలో, జుకర్‌ బెర్గ్‌ (85 బిలియన్‌ డాలర్లు) తృతీయ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 2.5 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో 339వ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.


logo