ఫ్యూచర్స్ సీఈవోకు సెబీ షాక్.. ఎందుకంటే?!

ముంబై: అమెజాన్-రిలయన్స్ మధ్య వివాదంలో చిక్కుకున్న దేశీయ రిటైల్ నెట్వర్క్ సంస్థ ఫ్యూచర్స్ సీఈవో కిశోర్ బియానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఏడాదిపాటు కిశోర్ బియానీని నిషేధిస్తూ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (సెబీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏడాది పాటు కిశోర్ బియానీ తన సారథ్యంలోని ఫ్యూచర్స్ రిటైల్ షేర్ల క్రయ, విక్రయాలు జరుపడానికి వీల్లేదు.
అప్పుల ఊబిలో చిక్కుకున్న ఫ్యూచర్స్ రిటైల్ నెట్వర్క్ సీఈవో కిశోర్ బియానీ.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తన రిటైల్ నెట్‌వర్క్‌ను 3.4 బిలియన్ల డాలర్లకు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్‌లో విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిపై గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారించడంతోపాటు తాత్కాలికంగా రిలయన్స్-ఫ్యూచర్స్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్ మార్కెట్లో కిశోర్ బియానీపై సెబీ ఏడాది నిషేధం విధించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇంతకుముందు ఫ్యూచర్స్ కూపన్స్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడు తమ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఫ్యూచర్స్ రిటైల్.. తన సంస్థను రిలయన్స్ రిటైల్‌లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నదని అమెజాన్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.