మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 01, 2021 , 02:32:50

రూ.32.49 లక్షల కోట్లు

రూ.32.49 లక్షల కోట్లు

  • 2020లో పెరిగిన మదుపరుల సంపద
  • తీవ్ర ఒడిదుడుకుల్లోనూ స్టాక్‌ మార్కెట్‌ రికార్డుల జోరు

2020లో తీవ్ర ఒడిదుడుకుల్లో సాగిన భారతీయ స్టాక్‌ మార్కెట్లు.. రికార్డుల వరదనే పారించాయి. కరోనా వైరస్‌ దెబ్బకు భీకర నష్టాలను చవిచూసిన సూచీలు.. వ్యాక్సిన్‌ ఆశలతో ఉవ్వెత్తున ఎగిశాయి. చివరకు లాభాలదే పైచేయి అవగా.. మదుపరుల సంపద ఏకంగా రూ.32.49 లక్షల కోట్లు ఎగబాకింది. ఈ ఏడాది సెన్సెక్స్‌ 15.7 శాతం,నిఫ్టీ 14.9 శాతం లాభాలను పంచాయి. 

ముంబై, డిసెంబర్‌ 31: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఓవైపు దడ పుట్టించిన.. మరోవైపు హుషారునెత్తించిన 2020 సంవత్సరం గురువారంతో ముగిసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మునుపెన్నడూ లేని ఎత్తుపల్లాలను ఈ ఏడాదే ఈక్విటీ మార్కె ట్లు చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ పడిలేచిన కెరటంలా సరికొత్త శిఖరాల్లోనే స్థిరపడ్డాయి. దీంతో బీఎస్‌ఈలోని మదుపరుల సంపద సంవత్సర కాలంలో రూ.32,49, 68 9.56 కోట్లు ఎగిసి రూ.1,88, 03,518.60 కోట్లను తాకింది. నిజానికి లాక్‌డౌన్‌తో పడకేసిన ఆర్థిక వ్యవస్థ, నీరసించిన వృద్ధిరేటుల మధ్య మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నారు. అయితే ప్రభుత్వాల ఉద్దీపనలు, వ్యాక్సిన్ల ఆశలు తిరిగి కొనుగోళ్లకు ఊపిరిలూదాయి. ఫలితంగా బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 15.7 శాతం, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 14.9 శాతం లాభాలను మదుపరులకు పంచగలిగాయి. 

చివరిరోజు అక్కడక్కడే

2020కి స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే కదలాడి వీడ్కోలు పలికాయి. ఉదయం ఆరంభం నుంచీ స్వల్ప లాభాల్లోనే ట్రేడ్‌ అవుతూ కనిపించాయి. అయినప్పటికీ నూతన శిఖరాలను మాత్రం వీడలేదు. సెన్సెక్స్‌ 5.11 పాయింట్లు పెరిగి 47,75 1.33 వద్ద, నిఫ్టీ అతిస్వల్పంగా 0.20 పాయింట్లు దిగి 13,981.75 వద్ద స్థిరపడ్డాయి. రెండింటికీ ఇవి రికార్డులే. అయితే ఒకానొక దశలో సెన్సెక్స్‌ 47,896.97 పాయింట్లను, నిఫ్టీ 14,024.85 పాయింట్లను తాకి సరికొత్త ఇంట్రా-డే రికార్డులను సృష్టించాయి. ఆసి యా మార్కెట్లలో హాంకాంగ్‌, చైనా లాభాల్లో ముగిశాయి. కానీ కరోనా స్ట్రెయిన్‌ భయాలతో ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.

బైబై 2020

  • మార్చి 24న బీఎస్‌ఈ కనిష్ఠంగా 25,638.90 పాయింట్లకు పడిపోయింది.
  • డిసెంబర్‌ 31న గరిష్ఠంగా 47,896.97 పాయింట్లను తాకింది.
  • 2020లో 7 నెలలు లాభా ల్లో ముగిసిన సెన్సెక్స్‌.. 5 నెలలు నష్టాలకే పరిమితమైంది.
  • ఒక్క మార్చిలోనే 8,828.8 పాయింట్లు కోల్పోయింది.
  • రూ.1,88,03,518.60 కోట్లకు బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ.

VIDEOS

logo