మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 05, 2020 , 00:01:01

ఉరిమిన ఉత్సాహం

ఉరిమిన ఉత్సాహం
  • భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
  • పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకొచ్చిన మదుపరులు
  • వీడిన బడ్జెట్‌ అసంతృప్తి, కరోనా వైరస్‌ భయాలు
  • 917 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్‌
  • 272 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ
  • గత రెండు రోజుల్లో రూ.3.57 లక్షల కోట్లు
  • ఎగబాకిన మదుపరుల సంపద

ముంబై, ఫిబ్రవరి 4:దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ భారీ లాభాలను సంతరించుకున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో మదుపరులు కొనుగోళ్లతో రెచ్చిపోయారు. ముఖ్యంగా విదేశీ మదుపరులు భారతీయ స్టాక్స్‌పై అమితాసక్తిని ప్రదర్శించారు. బడ్జెట్‌ రోజున లాభాల స్వీకరణకు దిగిన మదుపరులంతా.. తిరిగి పెట్టుబడుల వైపు మళ్లారు. దీంతో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 917.07 పాయింట్లు లేదా 2.30 శాతం ఎగబాకి మరోసారి 40 వేల మార్కును అధిగమించి 40,789.38 వద్ద ముగిసింది. గతేడాది సెప్టెంబర్‌ 23 నుంచి సెన్సెక్స్‌ ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారి. ఒకానొక దశలో 40,818.94 పాయింట్లను తాకడం విశేషం. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 271.75 పాయింట్లు లేదా 2.32 శాతం ఎగిసి 11,979.65 వద్ద నిలిచింది. నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థపై ఏర్పడిన ఆందోళనల మధ్య మదుపరులు స్టాక్‌ పెట్టుబడులపట్ల ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.


 దీనివల్లే సూచీలు పడుతూలేస్తూ పయనిస్తున్నాయి. ఈ సమయంలో బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉండటం, చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడం, ఇది ప్రపంచ దేశాలకు విస్తరించడం.. పరిస్థితిని మరింత దిగజార్చాయి. అయితే మదుపరులు ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు రోజుల లాభాలు, మంగళవారం భారీ లాభాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాగా, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, మెటల్‌, ఆయిల్‌, గ్యాస్‌, విద్యుత్‌, నిర్మాణ, ఆర్థిక రంగాల్లో ర్యాలీ కనిపించింది. టైటాన్‌ షేర్‌ విలువ అత్యధికంగా 7.97 శాతం పుంజుకున్నది. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌ షేర్ల విలువ ఆకర్షణీయంగా పెరిగింది. అయితే బజాజ్‌ ఆటో, హిందుస్థాన్‌ యునిలివర్స్‌ (హెచ్‌యూఎల్‌) షేర్లు మాత్రం మదుపరులను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. ఫలితంగా నష్టాలను మూటగట్టుకున్నాయి. మిడ్‌-క్యాప్‌ 1.37 శాతం, స్మాల్‌-క్యాప్‌ సూచీ 1.29 శాతం చొప్పున లాభాలను అందుకున్నాయి.


లాభాలకు కారణాలివే..కోలుకున్న  తయారీ రంగం

గత నెల తయారీ రంగం కార్యకలాపాలు పుంజుకోవడం కూడా స్టాక్‌ మార్కెట్ల లాభాలకు కారణమైంది. కీలకమైన ఉత్పాదక రంగం మళ్లీ గాడిలో పడిందన్న సంకేతాలు జనవరి ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐతో వచ్చాయి. గతేడాది డిసెంబర్‌లో ఈ సూచీ 52.7 శాతంగా ఉండగా, జనవరిలో 55.3 శాతానికి పెరిగింది. 


తగ్గిన ముడి చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ముడి చమురు ధరలు కూడా స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సోమవారం 13 నెలల కనిష్ఠానికి క్రూడాయిల్‌ ధరలు దిగొచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ఉదయం ట్రేడింగ్‌లో 1.82 డాలర్లు పడిపోయి 54.80 డాలర్లకు చేరింది. గతేడాది జనవరి నుంచి ఇదే అత్యంత కనిష్ఠం. దేశ ఇంధన అవసరాలను 80 శాతం దిగుమతులే తీరుస్తున్న నేపథ్యంలో ధరల పతనం మార్కెట్లకు కలిసొచ్చింది.


రూ.3.57 లక్షల కోట్లు జూమ్‌

స్టాక్‌ మార్కెట్ల లాభాలు మదుపరుల సంపదను అమాంతం పెంచేశాయి. మంగళవారం సెన్సెక్స్‌ 917 పాయింట్లు పెరుగడంతో గడిచిన రెండు రోజుల్లో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3.57 లక్షల కోట్లు ఎగబాకింది. సోమవారం ట్రేడింగ్‌లో సూచీ 136.78 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ రోజున 988 పాయింట్లు నష్టపోయిన నేపథ్యంలో వరుస లాభాలు మార్కెట్‌పై కొత్త అంచనాలకు తెరలేపుతున్నాయి. శనివారం ఒక్కరోజే రూ.3.46 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయిన సంగతి విదితమే. కాగా, సోమ, మంగళవారాల్లో ఆయా సంస్థల మార్కెట్‌ విలువ రూ.3,57,044.43 కోట్లు ఎగిసి రూ.1,56,61,769.40 కోట్లకు చేరింది. మంగళవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో 1,618 షేర్లు లాభాల్లో ముగియగా, 885 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 181 షేర్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి.


13 పైసలు బలపడిన రూపాయి

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం 13 పైసలు బలపడింది. 71.25 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 71.09 స్థాయికి రూపాయి మారకం విలువ చేరడం గమనార్హం. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో భారీ లాభాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం కలిసొచ్చిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు ట్రేడింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు. నిజానికి ద్రవ్యలోటు లక్ష్యాలు పెరుగడం, కరోనా వైరస్‌ వ్యాప్తి ఫారెక్స్‌ మార్కెట్‌ను భయపెడుతూనే ఉన్నాయని, అయినప్పటికీ స్థానిక కరెన్సీకి మద్దతు లభించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్ష, ద్రవ్యోల్బణంపై దాని ప్రకటన, వృద్ధిరేటు అంచనాలు ప్రస్తుతం మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలన్నారు.


గ్లోబల్‌ మార్కెట్లలో జోష్‌

కరోనా వైరస్‌ భయాలతో విలవిలలాడిన అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు కోలుకోవడం.. భారతీయ స్టాక్‌ మార్కెట్ల లాభాలకు బాటలు వేసింది. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. చైనా రిజర్వ్‌ బ్యాంక్‌.. వైరస్‌ భయాలతో కుంటుపడిన ఆ దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చేలా రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తుండటం మదుపరులను ఆకట్టుకున్నది.


వీడిన బడ్జెట్‌ ఆందోళనలు

బడ్జెట్‌ ఆందోళనల నుంచి మదుపరులు తేరుకోవడం కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్ల లాభాలకు దోహదం చేసింది. ఇటీవలి బడ్జెట్‌ ప్రకటనలు, ప్రతిపాదనలు మదుపరులను తీవ్ర నిరుత్సాహంలోకి నెట్టిన సంగతీ విదితమే. అయితే కొనసాగిన విదేశీ మదుపరుల పెట్టుబడులతో సోమవారం నుంచి మార్కెట్‌ మళ్లీ లాభాలను సంతరించుకోగా.. మంగళవారం భారీ లాభాల దిశగా పయనించింది. దేశీయ మదుపరుల్లోనూ ధైర్యం వచ్చింది.


ఆకట్టుకున్న బడా సంస్థల షేర్లు

బడా కంపెనీల షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, హీరో మోటోకార్ప్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ వంటి ప్రముఖ సంస్థల షేర్ల విలువ మంగళవారం ట్రేడింగ్‌లో పెరిగింది. దీంతో మిగతా షేర్లపైనా ఈ సానుకూల ప్రభావం కనిపించింది. 


logo
>>>>>>