శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 03, 2021 , 01:08:26

ఆకాశమే హద్దురా..

ఆకాశమే హద్దురా..

  • కొనసాగిన బడ్జెట్‌ ర్యాలీ 
  • రెండో రోజూ కొనుగోళ్ల జోష్‌లో మదుపరులు
  • ఆల్‌టైమ్‌ హైకి దేశీయ స్టాక్‌ మార్కెట్లు
  • సెన్సెక్స్‌ 1,197, నిఫ్టీ 367 పాయింట్లు వృద్ధి

ముంబై, ఫిబ్రవరి 2: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ ఉత్సాహం కొనసాగింది. మంగళవారం కూడా మదుపరులు కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సూచీలు ఆల్‌టైమ్‌ హై వద్ద స్థిరపడ్డాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 1,197.11 పాయింట్లు లేదా 2.46 శాతం ఎగబాకి గరిష్ఠ స్థాయి 49,797.72 వద్దకు చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 366.65 పాయింట్లు లేదా 2.57 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 14,647.85 వద్ద నిలిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పద్దు మార్కెట్‌ సెంటిమెంట్‌ను అమాంతం పెంచేయగా, ఈ ఒక్కరోజే సెన్సెక్స్‌ 2,315 పాయింట్లు పుంజుకున్నది. నిఫ్టీ సైతం 647 పాయింట్లు అందుకున్నది. దీంతో గడిచిన ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 3,511.95 పాయింట్లు, నిఫ్టీ 1,013.55 పాయింట్లు లాభపడినైట్లెంది. అంతకుముందు వారం రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 3,506 పాయింట్లు, నిఫ్టీ 1,010 పాయింట్లు క్షీణించిన సంగతి విదితమే.

ఆకట్టుకున్న బ్యాంకింగ్‌ షేర్లు

బ్యాంకింగ్‌, ఆర్థిక, మౌలిక రంగ షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సెన్సెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ షేర్‌ విలువ అత్యధికంగా 7.10 శాతం పెరిగింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతి సుజుకీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లూ లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌ షేర్ల విలువ మాత్రమే 2.34 శాతం క్షీణించింది. మొత్తంగా బీఎస్‌ఈ ఇండస్ట్రియల్స్‌, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, రియల్టీ, బ్యాంకింగ్‌ సూచీలు 4.23 శాతం ఎగబాకాయి. స్మాల్‌క్యాప్‌ 1.59 శాతం, మిడ్‌క్యాప్‌ 2.26 శాతం ఎగిశాయి.

రెండు రోజుల్లో 10.48 లక్షల కోట్లు జూమ్‌

బడ్జెట్‌ ర్యాలీతో మదుపరుల సంపద గడిచిన ఈ రెండు రోజుల్లో ఏకంగా రూ.10.48 లక్షల కోట్లు ఎగబాకింది. 

బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ రూ.10,48,253.99 కోట్లు ఎగిసి రూ.1,96,60, 898.02 కోట్లకు చేరింది. మంగళవారం ఒక్కరోజే .4,14,184. 32 కోట్లు పెరిగింది. సోమవారం రూ.6.34 లక్షల కోట్లు ఎగిసిన విషయం తెలిసిందే. కాగా, బడ్జెట్‌ ఉత్సాహానికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, విదేశీ మదుపరుల పెట్టుబడులూ వరుస భారీ లాభాలకు దోహదం చేశాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా ఉద్దీపన చర్చలతో ప్రధాన ఆసియా, ఐరోపా మార్కెట్లు  లాభాల్లోనే ముగిశాయి. 

డిసెంబర్‌కల్లా 51వేలకు

స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్న వేళ అంచనాలూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆఖరుకల్లా సెన్సెక్స్‌ 51,000 పాయింట్ల వద్ద స్థిరపడుతుందని కొటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. నిఫ్టీ సైతం 15,000 పాయింట్ల మార్కుకు చేరుతుందని చెప్పింది. నిజానికి ఇంతకుముందు సెన్సెక్స్‌ 46వేల వద్ద, నిఫ్టీ 13,500 వద్ద ఉంటాయని కొటక్‌ అంచనా వేసింది. కరోనా వైరస్‌ దెబ్బకు గతేడాది సూచీలు భీకర నష్టాల్లో కదలాడిన సంగతి విదితమే. దీంతో అంచనాలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే బడ్జెట్‌తో లాభాలను సంతరించుకుంటుండటంతో అంచనాలూ మారుతున్నాయి.

సెన్సెక్స్‌ బడ్జెట్‌ రికార్డులు

వారం రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌

జనవరి 21 తర్వాత బడ్జెట్‌ జోష్‌తో మళ్లీ ఫిబ్రవరి 1న లాభాల్లోకి

2,314.84 పాయింట్లు పెరిగి 

48,600.61 కి చేరిక

సోమవారం 1,494.23 కోట్ల విదేశీ పెట్టుబడులు రాక

  • 1997 నుంచి బడ్జెట్‌ ప్రకటన రోజు ఇదే అత్యధిక పెరుగుదల
  • వరుసగా రెండోరోజూ 1,197.11 పాయింట్లు పైకి
  • ఆల్‌టైమ్‌ హైని సృష్టిస్తూ 49,797.72 పాయింట్ల వద్దకు సూచీ
  • ఈ రెండు రోజుల్లో 3,511.95 పాయింట్లు వృద్ధి
  • మంగళవారం ఒకానొక దశలో 1,553.87 పాయింట్లు పెరిగి 50,154.48 వద్దకు
  • వారం రోజుల్లో 50 వేల పాయింట్లను తాకడం రెండోసారి

VIDEOS

logo