శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 11, 2020 , 23:33:29

కోలుకున్న రూపాయి

కోలుకున్న రూపాయి
  • డాలర్‌తో పోల్చితే 49 పైసలు ఎగబాకి 73.68కి చేరిక

ముంబై, మార్చి 11: రూపాయి మారకం విలువ తిరిగి పుంజుకున్నది. బుధవారం ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే 49 పైసలు పెరిగి 73.68 వద్ద స్థిరపడింది. సోమవారం 17 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 74.17 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తితో కుదేలవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. మదుపరులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ క్రమంలోనే అన్ని దేశాల మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. భారతీయ స్టాక్‌ మార్కెట్లూ భారీగా పతనమైన సంగతి విదితమే. అయితే మంగళవారం హోలీ కారణంగా మార్కెట్లు మూతపడగా, మరుసటి రోజు ఆరంభంలోనే లాభాలను సంతరించుకుని ట్రేడర్లలో రూపాయి విశ్వాసం పెంచింది. మొదట్లోనే 73.88 స్థాయిని తాకగా, ఒకానొక దశలో 73.55కు బలపడింది. చివరకు 73.68 వద్ద నిలిచింది.


లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

మరోవైపు దేశీయ స్టాక్‌ మార్కెట్లు సైతం లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 62.45 పాయింట్లు లేదా 0.18 శాతం అందుకుని 35,697.40 వద్దకు చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ స్వల్పంగా 6.95 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 10,458.40 వద్ద నిలిచింది. 


logo