శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 18, 2020 , 00:41:47

ప్రారంభ లాభాలు ఆవిరి

ప్రారంభ లాభాలు ఆవిరి

-చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి 

-సెన్సెక్స్‌ 811, నిఫ్టీ 230 , పాయింట్లు క్షీణత

ముంబై, మార్చి 17: దేశీయ స్టాక్‌ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకోవడంతో భారీ ఊగిసలాట దోరణిలో ట్రేడయ్యాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్ది లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో మళ్లీ 32 వేల మార్క్‌ను దాటింది. చివరి అరగంటలో మదుపరులు విక్రయాలకు మొగ్గుచూపడంతో మళ్లీ నష్టాల నష్టాల్లోకి జారుకున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు భారత్‌లో కరోనా వైరస్‌తో మరొకరు మృతి చెందడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా చివరకు 810.98 పాయింట్లు లేదా 2.58 శాతం నష్టపోయి 30,579.09 వద్ద స్థిరపడింది. సూచీలు 1,653 పాయింట్ల శ్రేణిలో కదలాడాయి. 

జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 230.35 పాయింట్లు లేదా 2.50 శాతం పతనం చెంది 8,967.05 వద్ద పరిమితమైంది. మార్చి 2017 తర్వాత నిఫ్టీ 9 వేల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను నీరుగార్చింది.  ఐసీఐసీఐ బ్యాంక్‌ 8.95 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.89 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 6.26 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 4.74 శాతం, ఇన్ఫోసిస్‌ 4.68 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 4.53 శాతం పతనం చెందాయి. మరోవైపు హెచ్‌యూఎల్‌, హీరో మోటోకార్ప్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, మారుతిలు లాభాల్లోకి వచ్చాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, టెలికం, టెక్‌, ఐటీ, రియల్టీ రంగ షేర్లు నాలుగు శాతానికి పైగా పతనమవగా, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు మాత్రం లాభాల్లోకి వచ్చాయి. 1,650 కంపెనీ షేర్లు పడిపోగా, 779 షేర్లు లాభపడ్డాయి. 

9.74 లక్షల కోట్లు మటాష్‌

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుగా రెండు రోజుల్లో రూ.9.74 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతున్నదన్న అంచనాలు మార్కెట్లను ముంచుతున్నది. గడిచిన రెండు రోజుల్లోనే మదుపరులు రూ.9,74,176.71 కోట్లు కోల్పోయి రూ. 1,19,52,066.11 కోట్లకు జారుకున్నది. వరుస రెండు రోజుల్లో సూచీ 3,500 పాయింట్లు పతనం చెందింది. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి పలు దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 


logo