బుధవారం 03 జూన్ 2020
Business - Apr 04, 2020 , 02:47:55

28 వేల దిగువకు సెన్సెక్స్‌

28 వేల దిగువకు సెన్సెక్స్‌

674 పాయింట్లు క్షీణించి సూచీ

పడేసిన బ్యాంకింగ్‌ రంగ షేర్లు

రెండు రోజుల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి

ముంబై, ఏప్రిల్‌ 3: స్టాక్‌ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చిత పరిస్థితి నెలకొనడం మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. మరోవైపు ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు దలాల్‌స్ట్రీట్‌ వర్గాల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా వారాంతం ట్రేడింగ్‌లో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 28 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 27,500 పాయిం ట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 674.36 పాయింట్లు(2.39 శాతం) నష్టపోయి 27,590.95 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 170 పాయింట్లు(2.06 శాతం) తగ్గి 8,083.80 వద్ద పరిమితమైంది. వరుసగా రెండు రోజుల్లో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 4,82,034.63 కోట్లు పడిపోయా రూ.1,08,66,722.96 కోట్లకు పరిమితమైంది.  ఈ వారంలో సెన్సెక్స్‌ 2,224.64 పాయింట్లు(7.46 శాతం), నిఫ్టీ 576.45 పాయింట్లు(6.65 శాతం) పతనం చెందాయి. దేశీయ బ్యాంకింగ్‌ వృద్ధిపై గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఆందోళన వ్యక్తం చేయడం మార్కెట్లలో అలజడి సృష్టించింది. ఆర్బీఎల్‌ బ్యాంక్‌ 15 శాతం పడిపోగా, యాక్సిస్‌ బ్యాంక్‌ అత్యధికంగా 9 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.49  శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 8 శాతం, ఎస్బీఐ 5.92 శాతం, సిటీ యూనియన్‌ బ్యాంక్‌ 3.67 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 3.51 శాతం, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.95 శాతం పతనం చెందాయి. మరోవైపు సన్‌ఫార్మా, ఐటీసీ, ఓఎన్‌జీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రాల షేర్లు లాభాల్లో ముగిశాయి.


logo