గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 02, 2021 , 01:46:01

బడ్జెట్‌ జోష్‌

బడ్జెట్‌ జోష్‌

 • భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
 • ఆకట్టుకున్న బ్యాంకింగ్‌, ఆర్థిక షేర్లు 
 • సెన్సెక్స్‌ 2,315, నిఫ్టీ 647 పాయింట్లు వృద్ధి

ముంబై, ఫిబ్రవరి 1: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ ఉత్సా హం తొణికిసలాడింది. గత వారం తీవ్ర అమ్మకాల ఒత్తిడితో సతమతమైన మదుపరులు.. సోమవారం తిరిగి కొనుగోళ్ల బాట పట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. వృద్ధికి ఊతమిచ్చేలా ఉందని మదుపరులు విశ్వసించారు. దీంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ ఒక్కరోజే 2,314.84 పాయింట్లు లేదా 5 శాతం ఎగబాకి 48,600.61 వద్ద స్థిరపడింది. గడిచిన దాదాపు 10 నెలల్లో ఒక్కరోజే ఈ స్థాయిలో పెరుగడం ఇది రెండోసారి. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 646.60 పాయింట్లు లేదా4.74 శాతం ఎగిసి 14,281.20 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభం నుంచే భారీ లాభాల్లో కదలాడిన మార్కెట్లు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా దూసుకుపోయాయి. కరోనా వైరస్‌తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక రంగానికి బడ్జెట్‌లో పెద్దపీట వేయడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను పెంచింది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యతనిచ్చారన్న అభిప్రాయాలు మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించాయని ట్రేడింగ్‌ సరళిని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మూలధన వ్యయాన్ని రూ.5.54లక్షల కోట్లకు పెంచడం, కొన్ని వస్తూత్పత్తులపై 100 శాతం వ్యవసాయ సెస్సును విధించడం మార్కెట్‌ను మెప్పించిందని అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రధాన ఆసియా, ఐరోపా మార్కెట్లూ లాభాల్లో ఉండటం కలిసొచ్చిందని చెప్తున్నారు. 

బీమా రంగ షేర్ల జోరు

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల షేర్లు మదుపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. వీటికితోడు బీమా రంగ షేర్లూ ఆకర్షణీయంగా నిలిచాయి. సెన్సెక్స్‌లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ విలువ అత్యధికంగా 14.75 శాతం పుంజుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లూ 12 శాతానికిపైగా ఎగిశాయి. అలాగే బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్బీఐ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లూ రాణించాయి. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనతో ఆయా సంస్థల షేర్ల విలువ 9 శాతం వరకు ఎగబాకింది. రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, మెటల్‌ షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. కాగా, సెన్సెక్స్‌ షేర్లలో కేవలం డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ మాత్రమే నష్టపోయాయి.

6 లక్షల కోట్లు పెరిగిన సంపద

స్టాక్‌ మార్కెట్ల భారీ లాభాలతో ఒక్కరోజే మదుపరుల సంపద రూ.6.34లక్షల కోట్లు ఎగిసింది. సెన్సెక్స్‌ 2,314.84 పాయింట్లు పెరుగడంతో బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ రూ.6,34,069.67 కోట్లు ఎగబాకి రూ.1,92,46,713.70 కోట్లకు చేరింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లూ 3.03 శాతం లాభపడటంతో మొత్తంగా మదుపరుల సంపద పరుగులు పెట్టింది.

 • ఆరోగ్యరంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి వచ్చే ఐదేండ్లలో రూ.50 వేల కోట్ల నిధులను వెచ్చించనుండటంతో ఈ రంగం మెరుగైన వృద్ధిని సాధించే అవకాశాలున్నాయి

- సతీష్‌ రెడ్డి, రెడ్డీస్‌ ల్యాబ్‌ చైర్మన్‌

 • వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నది. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్యా రంగాలకు పెద్దపీట వేశారు. పన్నుల్లో సంస్కరణలు, లిటిగేషన్లు తగ్గించడానికి తీసుకున్న నిర్ణయాలు స్వాగతిస్తున్నాం

- కృష్ణ బొడనపు, 

 • సీఐఐ తెలంగాణ చైర్మన్‌కరోనా వైరస్‌తో ఆరోగ్యానికి అత్యధికంగా నిధులు కేటాయించడం శుభసూచికం. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, సైంటిస్టులు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం విశేషం. 

- ప్రతాప్‌ సీ రెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు చైర్మన్‌

 • బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రూ.20 వేల కోట్ల నిధులను కేటాయించడం స్వాగతిస్తున్నా. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ మౌలిక, గ్రామీణానికి అత్యధికంగా నిధులు కేటాయించారు’

- ఎస్‌.ఎస్‌. మళ్లికార్జున రావు, పీఎన్‌బీ ఎండీ, సీఈవో

 • సార్వత్రిక బడ్జెట్‌లో నరేంద్ర మోదీ ముద్ర స్పష్టంగా కనిపించింది. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, వొకల్‌ ఫర్‌ లోకల్‌ అనే నినాదంతో భారీగా కేటాయింపులు జరిపారు

- సునీల్‌ భారతీ మిట్టల్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌

 • సంస్కరణల్లో భాగంగా రెండు బ్యాంకులు, బీమా సంస్థల్లో వాటా విక్రయించాలనుకోవడం మంచి పరిణామం. తద్వారా మౌలిక రంగానికి మరింత బూస్ట్‌నిచ్చినట్లు అవుతున్నది

- అనిల్‌ అగర్వాల్‌, వేదాంతా రిసోర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌

 • ఆర్థిక రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం భారీగా నిధులు కేటాయించడం విశేషం  

- ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్‌

 • వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నది బడ్జెట్‌. ఆత్మనిర్భార్‌ భారత్‌ను మరింత బలోపేతం దిశగా చర్యలు తీసుకున్నారు

- ఉదయ్‌ శంకర్‌, ఫిక్కీ ప్రెసిడెంట్‌

 • మౌలిక, విద్యా, హౌజింగ్‌, ఆరోగ్య రంగాలకు భారీ స్థాయిలో నిధులు కేటాయించారు. వ్యాక్సిన్ల కొరత రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది

- ఉదయ్‌ కొటక్‌, సీఐఐ ప్రెసిడెంట్‌


VIDEOS

logo