మంగళవారం 07 ఏప్రిల్ 2020
Business - Feb 28, 2020 , 23:02:56

మార్కెట్లకు వైరస్‌

మార్కెట్లకు వైరస్‌
  • చరిత్రలో రెండో అతిపెద్ద పతనం
  • కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు
  • సెన్సెక్స్‌ 1,448, నిఫ్టీ 431 పాయింట్ల పతనం
  • రూ.5.45 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై, ఫిబ్రవరి 28:స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నదన్న భయాలు మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టించాయి. మార్కెట్లు ప్రారంభమైన తొలి గంటలోనే ఐదు లక్షల కోట్లకు పైగా సంపద కోల్పోవడం చూస్తుంటే ఈ వైరస్‌ దెబ్బ ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతున్నది. ఒక దశలో 1,500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ వారాంతం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 1,448.37 పాయింట్లు లేదా 3.64 శాతం పడిపోయి 38,297.29 వద్ద ముగిసింది.  స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో రెండో అతిపెద్ద పతనం ఇదే. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా అప్పట్లో భారీగా నష్టపోయిన సూచీలు మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్‌తో కకావికలమయ్యాయి. ఆగస్టు 24, 2015న సూచీ 1,624.51 పాయింట్ల మేర నష్టపోయిన విషయం తెలిసిందే. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 431.55 పాయింట్లు లేదా 3.71 శాతం క్షీణించి 11,201.75 వద్ద పరిమితమైంది. 


మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్‌ 2,872.83 పాయింట్లు లేదా 6.97 శాతం, నిఫ్టీ 879.10 పాయింట్లు లేదా 7.27 శాతం పడిపోయాయి. కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ మరో 57 దేశాలకు విస్తరించడం, ముఖ్యంగా న్యూజిలాండ్‌, నైజీరియా, నెదర్లాండ్స్‌ దేశాల్లో తొలి కేసు నమోదవడం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనను పెంచింది. ఫలితంగా వరుసగా ఆరు రోజులుగా పతనమవుతూ వచ్చిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం బ్లాక్‌ ఫ్రైడేగా నిలిచిపోయింది. పవిత్ర మక్కాకు రాకపోకలను నిలిపివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయించడం, యూరప్‌ దేశాలు దాదాపు పర్యవేక్షణలో ఉండటంతో మార్కెట్లపై  భయాలు మరింత పెరిగాయి. దీంతో దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా మెటల్‌, ఐటీ, టెక్‌, బేసిక్‌ మేటిరీయల్‌, ఇండస్ట్రీయల్‌, ఎనర్జీ, ఫైనాన్స్‌, ఆటో, బ్యాంకెక్స్‌ సూచీలు ఏడు శాతానికి పైగా పతనమయ్యాయి.


ఆరు రోజుల్లో 11 లక్షల కోట్లు మాయం

స్టాక్‌ మార్కెట్ల భారీ పతనంతో మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. ఒక్క శుక్రవారమే మదుపరులు ఏకంగా రూ. 5,45,452.52 కోట్ల మేర సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల మార్కె ట్‌ విలువ రూ. 1,46,94,571. 56 కోట్ల కు పడిపోయింది. గురువారం ఇది రూ. 1,52,40, 024.08 కోట్లుగా ఉన్నది. వరుసగా ఆరు రోజుల్లో మదుపరులు రూ. 11,76,985.88 కోట్ల  సంపదను కోల్పోయారు. కరోనా వైరస్‌ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ  స్వల్పకాలంపాటు కుదేలవుతుందని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 


ఆటో స్టాకులు ఢమాల్‌

వాహన రంగ షేర్లు ఢమాల్‌మన్నాయి. కరోనా వైరస్‌తో వాహన విడిభాగాల సరఫరా నిలిచిపోనున్నట్లు వచ్చిన సంకేతాలకు తోడు రెండు దశాబ్దాలకు పైగా అమ్మకాలు పడిపోవడంతో ఈ రంగ షేర్లు కుదేలయ్యాయి. టాటా మోటర్స్‌ 11.03 శాతం పతనమవగా, అశోక్‌ లేలాండ్‌ 8.15 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 7.50 శాతం, బజాజ్‌ ఆటో 1.60 శాతం, మారుతి సుజుకీలతోపాటు టీవీఎస్‌ మోటర్‌, ఎమ్మారఫ్‌, హీరో మోటోకార్ప్‌, ఐచర్‌ మోటర్స్‌, అపోలో టైర్స్‌ కూడా పతనం చెందాయి. 


బంగారానిదీ అదే దారి...

స్టాక్‌ మార్కెట్లతోపాటు బంగారం ధరలు కూడా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ పడిపోవడంతో ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.222 తగ్గి రూ.43,358కి పడిపోయింది. గురువారం ఈ ధర రూ.43,580గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి మద్దతు లభించకపోవడంతో కిలో వెండి ధర రూ.60 తగ్గి రూ.48, 130కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,632 డాలర్లకు, వెండి 17.25 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. 


సంపన్నులనూ వదలని కరోనా

కరోనా వైరస్‌ దెబ్బకు దేశీయ కుబేరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గడిచిన పక్షం రోజుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఏకంగా 5 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. ఇది మన కరెన్సీలో రూ.36 వేల కోట్లకు పైమాటే. విప్రో చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ రూ.6,281 కోట్లు (869 మిలియన్‌ డాలర్లు), ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా రూ.6,374 కోట్లు (884 మిలియన్‌ డాలర్లు), అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ 496 మిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. వీరితోపాటు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చీఫ్‌ ఉదయ్‌ కొటక్‌, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీలు కూడా భారీగా నష్టపోయారు. గడిచిన పదిహేను రోజులుగా స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవుతుండటంతో కుబేరుల ఆస్తి భారీగా పతనమైంది. ఈ నెల 12 నుంచి 11 సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3 వేల పాయింట్ల వరకు క్షీణించింది. దీంతో మదుపరుల సంపద రూ.11.52 లక్షల కోట్లు కరిగిపోయింది. టాటా గ్రూపునకు చెందిన 21 కంపెనీలు నికరంగా రూ.41,390 కోట్ల సంపదను కోల్పోగా.. అదానీ గ్రూపు రూ.27,100 కోట్లు, ఆదిత్యా బిర్లా గ్రూపు రూ.17,500 కోట్లు, వాడియా గ్రూపు రూ.3,300 కోట్లు నష్టపోయినట్టు బ్లూంబర్గ్‌ వెల్లడించింది. 


వ్యక్తి 
కంపెనీ 
కోల్పోయిన  సంపద (కోట్లలో)
ముకేశ్‌ అంబానీ
రిలయన్స్‌
36,100
కుమార మంగళం బిర్లా
ఆదిత్యా బిర్లా
6,300
అజీం ప్రేమ్‌జీ
విప్రో
6,200
గౌతమ్‌ అదానీ
అదానీ
3,500

-41,930పతనానికి గల కారణాలు..

డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ వ్యాఖ్యలు పతనానికి ఆజ్యం పోశాయి. ప్రపంచ దేశాలన్నీ స్పందిస్తేనే కరోనాను అరికట్టడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో అలజడి సృష్టించాయి. 


ఆర్థిక మాంద్యం భయాలు..

ఆర్థిక మాంద్యం భయాలు స్టాక్‌ మార్కెట్లను చుట్టుముట్టాయి.  దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై మూడీస్‌, డీఅండ్‌పీ ఆందోళన వ్యక్తం చేయడం, మరోవైపు కరోనా వైరస్‌తో వృద్ధి మరింత దిగజారే అవకాశాలున్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్లను కుప్పకూల్చాయి. 


ఎఫ్‌పీఐల్లో ఆందోళన

వరుసగా మూడు నెలలుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న ఎఫ్‌పీఐలు.. ఈ నెల చివర్లో భారీగా నిధులను ఉపసంహరించుకున్నారు. ఈ వారంలో రూ.6,812.57 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. 


నాలుగేండ్ల కనిష్ఠానికి క్రూడాయిల్‌

క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధరలు వరుసగా ఆరో రోజు శుక్రవారం మరో నాలుగు శాతం పడిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ధర 51.01 డాలర్లుగా ఉన్నది. ఈ వారంలో ఇంధన ధర 12 శాతం తగ్గినట్టయింది. 


వృద్ధి గణాంకాలు..

కరోనా వైరస్‌తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను భారత వృద్ధి గణాంకాలు కూడా పతనానికి పరోక్షంగా దోహదం చేశాయి. జీడీపీ గణాంకాలతోపాటు కీలక రంగాల పనితీరు కూడా విడుదల కానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా అమ్మకాలకు మొగ్గుచూపారు. 


విమానయాన రంగ షేర్లు డీలా..

విమానయాన రంగ షేర్లను కూడా కరోనా వైరస్‌ వదలడం లేదు. ఈ వైరస్‌తో ప్రపంచ పర్యాటక రంగం కుదేలవుతున్నట్లు వచ్చిన సంకేతాలతో విమానయాన కంపెనీల షేర్లు భారీగా పతనం చెందాయి.  ఇండిగో పేరుతో విమానాలు నడుపుతున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు 4.80 శాతం, స్పైస్‌జెట్‌ 4.69 శాతం, జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 4.26 శాతం పడిపోయాయి. 


 టెక్‌ మహీంద్రా 8.14 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది

టాటా స్టీల్‌, మహీంద్రాలు 7 శాతానికి పైగా పతనమవగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌, ఇన్ఫోసిస్‌, ఎస్బీఐ, యాక్సిస్‌ బ్యాంకులు 5 శాతానికి పైగా మార్కెట్‌ వాటాను కోల్పోయాయి. 

టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, సన్‌ఫార్మా, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, హీరో, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాసిమెంట్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీలు రెండు శాతంకు పైగా పతనం చెందాయి.

టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌, మారుతిలు కూడా మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. 

 2,620 షేర్లకుగాను 2,011 షేర్లు పతనమవగా, 456 షేర్లు లాభపడ్డాయి. 153 షేర్లు యథాతథంగా ఉన్నాయి. 

335 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా, 106 స్టాకులు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. 

52 వారాల కనిష్ఠానికి 437 కంపెనీల షేర్లు జారుకన్నాయి. 

కానీ, 36 స్టాకులు ఏడాది గరిష్ఠానికి చేరుకోవడం విశేషం. 


logo