మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 04, 2020 , 23:48:59

వెంటాడిన వైరస్‌..!

వెంటాడిన వైరస్‌..!
  • ఒక దశలో 900 పాయింట్లకుపైగా సెన్సెక్స్‌ పతనం
  • చివరకు 214 పాయింట్ల నష్టంతో సరి

ముంబై, మార్చి 4:  కరోనా వైరస్‌ కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చైనాలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న ఈ  వైరస్‌ బాదితులు భారత్‌లో రోజురోజుకు పెరుగుతుండటం స్టాక్‌ మార్కెట్లలో అలజడి సృష్టించింది. ఈ వైరస్‌ దెబ్బకు నష్టాల్లో ప్రారంభమైన సూచీలు క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.  కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని, ముఖ్యంగా ప్రధాని ప్రతిరోజు ఈ పరిస్థితిని మానటరింగ్‌ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించడంతో దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భారీ అమ్మకాల నుంచి తేరుకున్నాయి. ఒక దశలో 945 పాయింట్లకు పైగా నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ చివరకు 214.22 పాయింట్ల నష్టంతో 38,409.48 వద్ద ముగిసింది. 38,716 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 37,846.10 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు ఇంతటి భారీ నష్టాల నుంచి కోలుకున్నది. 


జాతీయా స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 52.30 పాయింట్లు పతనం చెంది 11,251 వద్ద పరిమితమైంది. బ్యాంకింగ్‌, వాహన, కన్జ్యూమర్‌ రంగాల షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా జరిగాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.85 శాతం తగ్గి టాప్‌ లూజర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫిన్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు రెండు శాతానికి పైగా కోల్పోగా..ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరో మోటోకార్ప్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, మారుతి షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ, సన్‌ఫార్మా 3.14 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, నెస్లె, బజాజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, టైటన్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. 


దెబ్బతీసిన ఫెడ్‌ నిర్ణయం..

వడ్డీరేట్లను తగ్గిస్తూ అమెరికా ఫెడరల్‌ రిజర్వు తీసుకున్న నిర్ణయం మార్కెట్లకు అంతగా రుచించలేదు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయం గా కరోనా వైరస్‌ మరింత మందికి సోకినట్లు వచ్చిన వార్తలు పతనాన్ని శాసించాయి. భారత్‌తోపాటు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా ఈ వైరస్‌ ప్రతికూల ప్రభావం చూపనున్నదని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. రంగాలవారీగా చూస్తే బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో, మెటల్‌ రంగ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. కానీ, ఐటీ, హెల్త్‌కేర్‌, టెక్‌ రంగ సూచీలు మాత్రం ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. 


logo
>>>>>>