సోమవారం 13 జూలై 2020
Business - May 28, 2020 , 00:36:44

కదం తొక్కిన సూచీలు

కదం తొక్కిన సూచీలు

  • 996 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌
  • 9,300 మార్క్‌ను దాటిన నిఫ్టీ

ముంబై, మే 27: గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగిన స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలబాటపట్టాయి. ప్రస్తుత నెలకుగాను డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగుస్తుండటం, బ్యాంకింగ్‌, ఆర్థిక, ఐటీ రంగ షేర్లు రాణించడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం స్తబ్ధుగా ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు తోడవడంతో దలాల్‌స్ట్రీట్‌ కొనుగోళ్లతో కళకళలాడింది. ఒకవైపు కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ పాతాళంలోకి పడిపోతున్నట్లు పలు రేటింగ్‌ ఏజెన్సీలు అంచనాలను మదుపరులు పట్టించుకోలేదు. ఇంట్రాడేలో 31,660 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షేర్ల సూచీ సెన్సెక్స్‌ 995.92 పాయింట్లు(3.25 శాతం) లాభంతో 31,605.22 వద్ద నిలిచింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 285.90 పాయింట్లు (3.17 శాతం) అందుకొని 9,314.95 వద్దకు చేరుకున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 1.5 లక్షలు దాటడంతో మదుపరుల్లో ఆందోళన పెరిగినప్పటికీ, గ్లోబల్‌ మార్కెట్లు వరుసగా లాభాల బాట పట్టడంతో సూచీలు కదం తొక్కాయి. 

ముఖ్యాంశాలు..

  • యాక్సిస్‌ బ్యాంక్‌ 13.46 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు లాభపడ్డాయి.
  • సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌లు రెండు శాతం వరకు నష్టపోయాయి.
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో మార్కెట్లు తిరిగి కోలుకుంటున్నాయి. ఈవారం చివర్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయనుండటం కూడా కలిసొచ్చింది.
  • రంగాలవారీగా చూస్తే బ్యాంకెక్స్‌ 7.31 శాతం లాభపడగా, ఫైనాన్స్‌, ఐటీ, మెటల్‌, టెక్‌, ఎనర్జీ రంగ షేర్లు బలపడ్డాయి
  • బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు స్వల్పంగా లాభపడ్డాయి. 
  • 1,345 షేర్లు లాభపడగా, 974 షేర్లు నష్టపోయాయి. 178 షేర్లు యథాతథంగా నిలిచాయి. 
  • మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.4,716 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం లాభించింది.  
  • డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పతనం చెంది 75.71 వద్ద ముగిసింది.

పెరిగిన సంపద 2 లక్షల కోట్లు 

స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోవడంతో మదుపరుల సంపద కూడా అమాంతం పెరిగింది. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.2,01,549.38 కోట్లు పెరిగి రూ.1,23,62,539.79 కోట్లకు చేరుకున్నది. గ్లోబల్‌ మార్కెట్లు భారీగా పుంజుకోవడం, బ్యాంకింగ్‌, ఆర్థికరంగ షేర్ల ఇచ్చిన దన్నుతో సూచీలు ఎగబాకాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి.

గత ముగింపు 
30,609.30
ప్రారంభం
30,793.11
కనిష్ఠం
30,525.68
గరిష్ఠం 
31,660.60
ముగింపు 
31,605.22


logo