బుధవారం 03 జూన్ 2020
Business - May 05, 2020 , 01:41:12

మార్కెట్లు లాక్‌డౌన్‌

మార్కెట్లు లాక్‌డౌన్‌

5.82 లక్షల కోట్ల సంపదఆవిరి

  • సెన్సెక్స్‌2,002 పాయింట్లు(5.94% డౌన్‌)
  • నిఫ్టీ 566 పాయింట్లు(5.74% డౌన్‌)

ముంబై, మే 4: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. లాక్‌డౌన్‌ను మరో పక్షం రోజులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తోడు కరోనా వైరస్‌పై అమెరికా-చైనాల మధ్య ముదురుతున్న వివాదం మార్కెట్ల పతనానికి ఆజ్యంపోసింది. ఈ మహమ్మారికి కారణం చైనానే అంటు అమెరికా విదేశాంగ మంత్రి ఆరోపణలు గుప్పించడంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ నీరుగారింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరు శాతం వరకు పతనమయ్యాయి.  వారం ప్రారంభ రోజే 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 2,002.27 పాయింట్లు లేదా 5.94 శాతం పతనం చెంది 31,715.35 వద్ద ముగిశాయి. గత నెల రోజుల్లో ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 566.40 పాయింట్లు (5.74 శాతం) క్షీణించి 9,293.50 వద్ద పరిమితమైంది. దీంతో మదుపరుల సంపద హారతికర్పూరంలా కరిగిపోయింది. బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల విలువ మరో రూ.5,82,695.93 కోట్లు కరిగిపోయి రూ.1,23,58,924.89 కోట్లకు జారుకున్నది.  30 షేర్ల ఇండెక్స్‌లో కేవలం రెండు మాత్రమే లాభపడగా, మిగతావన్నీ నష్టాల్లో ముగిశాయి.

  • బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 4.25 శాతం, స్మాల్‌క్యాప్‌ 3.14 శాతం పతనం చెందాయి. 
  • 1,865 షేర్లు క్షీణించగా, 554 షేర్లు లాభాల్లో ముగిశాయి. 178 షేర్లు యథాతథంగా ఉన్నాయి.
  • రంగాలవారీగా చూస్తే ఫైనాన్స్‌, బ్యాంకెక్స్‌, మెటల్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌, రియల్టీ, ఆటో రంగాల షేర్లు 8 
  • శాతానికి పైగా నష్టపోగా, టెలికం, హెల్త్‌కేర్‌ రంగ సూచీలు రెండు శాతానికి పైగా పెరిగాయి. 
  • నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో హిందుస్థాన్‌ యునిలీవర్‌ షేరు భారీగా పడిపోయింది. కంపెనీ షేరు ధర 5.16 శాతం తగ్గి రూ.2,082.30 వద్ద ముగిసింది. 
  • రిలయన్స్‌ షేరు కూడా 2.16 శాతం తగ్గి రూ.1,435.40 వద్ద స్థిరపడింది. 
  • మరోమారు చైనాపై నూతన టారిఫ్‌లను విధించనున్నట్లు ట్రంఫ్‌ వ్యాఖ్యానించడంతో ప్రపంచ మార్కెట్లలో అలజడి సృష్టించింది. 
  • రూపాయి మారకం విలువ 64 పైసలు పతనమై 75.73 వద్ద స్థిరపడింది.

ఆటో షేర్లకు అమ్మకాల సెగ

వాహన రంగ షేర్లకు అమ్మకాల సెగ గట్టిగానే తగిలింది. గత నెలలో ఒక్కటంటే ఒక్క కారును విక్రయించకపోవడంతో ఈ రంగ షేర్లు పది శాతానికి పైగా పతనం చెందాయి. మదర్‌సన్‌ సిస్టమ్స్‌ 12.51 శాతం నష్టపోగా, టాటా మోటర్స్‌ 9.88 శాతం, మారుతి 8.75 శాతం, అపోలో టైర్స్‌ 7.69 శాతం, హీరో  7.61 శాతం, బజాజ్‌ ఆటో 7.12 శాతం, ఐచర్‌ మోటర్స్‌ 6.45 శాతం, అశోక్‌ లేలాండ్‌ 5.73 శాతం, టీవీఎస్‌ 5.20 శాతం, మహీంద్రా 2.66 శాతం దిగువకు పడిపోయాయి. 


logo