గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 20, 2020 , 00:17:16

నష్టాలకు బ్రేక్‌

నష్టాలకు బ్రేక్‌
  • సెన్సెక్స్‌ 429 పాయింట్లు అప్‌
  • 133 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • మెరిసిన రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు
  • మదుపరులను వీడుతున్న కరోనా భయాలు

ముంబై, ఫిబ్రవరి 19: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ లాభాలను సంతరించుకున్నాయి. వరుసగా నాలుగు రోజులు నష్టాలకే పరిమితమైన సూచీలు.. బుధవారం తిరిగి కోలుకున్నాయి. చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌.. భారత్‌నూ భయపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాణాంతక మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా చర్యలు తీసుకుంటామన్న కేంద్ర ప్రభుత్వ భరోసా మదుపరులను ఆకట్టుకున్నది.


మంగళవారం ఫార్మా, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ హార్డ్‌వేర్‌, సోలార్‌, ఆటో, సర్జికల్‌ ఎక్విప్‌మెంట్స్‌, పెయింట్స్‌ తదితర రంగాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. వైరస్‌ ప్రభావాన్ని తగ్గించే దిశగా తక్షణమే తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన సంగతి విదితమే. దేశీయ పరిశ్రమ రక్షణకు అనుగుణంగా చర్యలు చేపడుతామన్నారు. ఈ ప్రకటన మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా పెంచేసింది. ఉదయం ఆరంభం నుంచే భారీ లాభాల్లో సూచీలు కదలాడుతూ వచ్చాయి. ఈ జోష్‌ చివరిదాకా కొనసాగింది. 


ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 428.62 పాయింట్లు లేదా 1.05 శాతం ఎగబాకి 41 వేల స్థాయిని అధిగమిస్తూ 41,323 వద్ద స్థిరపడింది. మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో ఒకానొక దశలో 41,357.16 పాయింట్ల గరిష్ఠాన్ని సూచీ అందుకున్నది. అయితే లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో కాస్త పడిపోయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 133.40 పాయింట్లు లేదా 1.11 శాతం ఎగిసి 12 వేల స్థాయిని దాటి 12,125.90 వద్ద నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల విలువ 2.79 శాతం మేర పుంజుకున్నది. 


సన్‌ ఫార్మా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్ల విలువ 1.33 శాతం దిగజారింది. ఎనర్జీ, హెల్త్‌కేర్‌, చమురు, గ్యాస్‌ రంగాల షేర్లు 2.37 శాతం పెరిగాయి. స్మాల్‌-క్యాప్‌ సూచీ 1.41 శాతం, మిడ్‌-క్యాప్‌ సూచీ 1.34 శాతం ఎగిసింది. మెజారిటీ ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లూ లాభాల్లోనే కదలాడుతున్నాయి. ‘మార్కెట్‌లో సానుకూల పవనాలు వీచాయి. ఏజీఆర్‌ బకాయిల సమస్యతో సతమతమవుతున్న టెలికం సంస్థలను ఆదుకునేలా ప్రభుత్వ చర్యలు ఉండనున్నాయన్న అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటం కూడా మదుపరులను కొత్త పెట్టుబడుల వైపు నడిపించాయి. చైనాలో మళ్లీ వ్యాపార కార్యకలాపాలు, పారిశ్రామికోత్పత్తి కుదురుకుంటున్నది. 


రూ.94 వేల కోట్లు

నిర్దిష్ట ఆదాయ సెక్యూరిటీల్లో పెట్టుబడులపై మ్యూచువల్‌ ఫండ్స్‌ దృష్టి సారించాయి. గతేడాది అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.94,000 కోట్లకుపైగా నిధుల రాక ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇందులో సగం ఓవర్‌నైట్‌, లిక్విడ్‌ ఫండ్ల ద్వారానే వచ్చినవి కావడం గమనార్హం. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో నమోదైన పెట్టుబడులు రూ.5,061 కోట్లు, రూ.19,691 కోట్లుగానే ఉన్నాయని మార్నింగ్‌స్టార్‌ నివేదిక ఆధారంగా తెలుస్తున్నది. 


38 శాతం పుంజుకున్న వొడాఫోన్‌ ఐడియా షేర్లు

వొడాఫోన్‌ ఐడియా షేర్‌ విలువ బుధవారం ట్రేడింగ్‌లో 38 శాతానికిపైగా పుంజుకున్నది. రూ.53 వేల కోట్లకుపైగా ఏజీఆర్‌ బకాయిలను ఈ సంస్థ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బాకీలను తీర్చేందుకు సంస్థ అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా బ్యాంక్‌ గ్యారెంటీల జోలికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెళ్లబోదన్న వార్తలు.. మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే బీఎస్‌ఈలో 38.28 శాతం ఎగిసి రూ.4.19 వద్ద ముగిసిన వొడాఫోన్‌ ఐడియా షేర్‌ విలువ.. ఎన్‌ఎస్‌ఈలో 40 శాతం ఎగబాకి రూ.4.20 వద్ద నిలిచింది. ఒకానొక దశలో షేర్‌ విలువ 48 శాతానికిపైగా పెరుగడం విశేషం.


logo