శుక్రవారం 05 జూన్ 2020
Business - May 04, 2020 , 02:34:38

క్యూ4 ఫలితాలు కీలకం

క్యూ4 ఫలితాలు కీలకం

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ సరళిపై నిపుణుల అంచనా

న్యూఢిల్లీ, మే 3: దేశీయ స్టాక్‌ మార్కెట్లను ఈ వారం కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు ప్రధానంగా నిర్దేశించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికానికి(జనవరి-మార్చి)గాను కార్పొరేట్‌ సంస్థలు ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీటి ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపై ఓ నిర్ణయానికి రావచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కరోనా కేసులు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమేనని అంటున్నారు. మరోవైపు సోమవారం స్థూల ఆర్థిక, పీఎంఐ గణాంకాలు కూడా విడుదల అవుతుండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌పై వీటి ప్రభావం కూడా ఉండే వీలున్నది. 

రూ.3.10 లక్షల కోట్లు

అమ్మకాల ఒత్తిడి నుంచి తేరుకుని కొనుగోళ్ల జోష్‌లో దూసుకుపోతున్నారు దేశీయ మదుపరులు. దీంతో గత వారం సెన్సెక్స్‌ టాప్‌-10 షేర్ల మార్కెట్‌ విలువ రూ.3,10,362.26 కోట్లు ఎగబాకింది. టీసీఎస్‌ విలువ అత్యధికంగా రూ. 73,753. 12 కోట్లు ఎగిసి రూ.7,56,049.23 కోట్లను తాకింది. 

మారని ఎఫ్‌పీఐల తీరు

ఎఫ్‌పీఐలు భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఏప్రిల్‌ నెలలో స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ.6,884 కోట్లు, రుణ మార్కెట్ల నుంచి రూ.8,519 కోట్లను వెనక్కి తీసుకున్నారు. 


logo