గురువారం 28 మే 2020
Business - Apr 24, 2020 , 00:15:46

ఉద్దీపన జోష్‌తో పరుగు

ఉద్దీపన జోష్‌తో పరుగు

  • భారీగా లాభపడ్డ స్టాక్‌ మార్కెట్లు
  • సెన్సెక్స్‌ 483, నిఫ్టీ 126 పాయింట్ల లాభం

ముంబై, ఏప్రిల్‌ 23: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు వచ్చిన వార్తలు మదుపరులను కొనుగోళ్ల వైపు మళ్లించాయి. ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్ల నుంచి వచ్చిన దన్నుతో ఇంట్రాడేలో 32 వేల పాయింట్ల దిశగా దూసుకెళ్లింది. చివరకు 483.53 పాయింట్లు లేదా 1.54 శాతం లాభపడి 31,863.08 వద్ద నిలిచింది. దీంతో సూచీలు ఆరు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 126.60 పాయింట్లు(1.38 శాతం) ఎగబాకి 9,313.90 వద్ద స్థిరపడింది. కొటక్‌ బ్యాంక్‌ 8.59 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టీసీఎస్‌ 5.97 శాతం, ఇన్ఫోసిస్‌ 5.67 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 4.97 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.44 శాతం, ఓఎన్‌జీసీ 2.98 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.84 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 2.12 శాతం, బజాజ్‌ ఆటో 2.07 శాతం, బజాజ్‌ ఫిన్‌లు మదుపరులను ఆకట్టుకున్నాయి. వీటితోపాటు టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌లు కూడా స్వల్పంగా లాభపడ్డాయి. కానీ, టైటాన్‌ 4.18 శాతం తగ్గి టాప్‌ లూజర్‌గా నిలిచింది. హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్బీఐ, ఐటీసీ, మారుతి, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీలు నష్టపోయాయి.  

ఆకట్టుకున్న ఐటీ రంగ షేర్లు

గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కార్పొరేట్ల ఆశాజనక ఫలితాలతో ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లు కదంతొక్కుతున్నాయి. ఐటీ, టెక్నాలజీ, బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, మెటల్‌, ఆటో, ఎనర్జీ రంగ షేర్లు 5 శాతం వరకు ఎగబాకగా, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌, ఎఫ్‌ఎంసీజీ, పవర్‌, యుటిలిటీ, టెలికం రంగ సూచీలు రెండు శాతం వరకు పతనం చెందాయి.  

62 పైసలు లాభపడ్డ రూపాయి

గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పతనమైన దేశీయ కరెన్సీ విలువ ఎట్టకేలకు కోలుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఫారెక్స్‌ మార్కెట్‌లో 62 పైసలు పెరిగి 76.06 వద్ద ముగిసింది. 


logo