గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 30, 2021 , 01:16:50

11 లక్షల కోట్లు ఆవిరి

11 లక్షల కోట్లు ఆవిరి

  • ఆరు రోజుల్లో సెన్సెక్స్‌ 3,500, నిఫ్టీ 1,010 పాయింట్ల డౌన్‌

ముంబై, జనవరి 29: ఈవారం స్టాక్‌ మార్కెట్లకు పీడకలనే మిగిల్చింది. దూసుకుపోయిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోయాయి. బడ్జెట్‌కు ముందు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మూకుమ్మడిగా సూచీలను పడేశాయి. దీంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. వరుసగా ఆరోరోజు శుక్రవారం కూడా సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో మదుపరులు ఏకంగా రూ.11 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. ఈ నెల 21 నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్‌ ఏకంగా 3,506 పా యింట్లు లేదా 7 శాతం నష్టపోయింది. దీంతో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 11,57, 928. 54 కోట్లు కరిగిపోయి రూ. 1,86,12, 644. 03 కోట్లకు పడిపోయింది. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్య వస్థపై ఆందోళన వ్యక్తంకావడం, దేశీయ వృద్ధిరేటులో మందగిస్తున్నదన్న సంకేతాలు మార్కెట్లను పడేశాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గా లు వెల్లడించాయి. 

వారాంతంలో అదే తీరు

వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన ఆర్థిక సర్వే మార్కెట్లను మెప్పించలేకపోయింది. గ్లోబల్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం, విదేశీ మదుపరులు నిధుల ఉపసంహరణ వంటి పరిణామాలతో వరుసగా ఆరోరోజు సూచీలు కుదేలయ్యాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు వారాంతం ట్రేడింగ్‌ ముగిసే సరికి 588.59 పాయింట్లు(1.26 శాతం) నష్టపోయి 46,285.77 వద్దకు జారుకోగా, నిఫ్టీ 182.95 పాయింట్లు(1.32 శాతం) తగ్గి 13,634.60 వద్ద ముగిసింది. 30 షేర్లలో 26 షేర్లు నష్టపోగా..కేవలం నాలుగు మాత్రమే లాభపడ్డాయి. బ్లూచిప్‌ సంస్థయైన డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతి, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లు అత్యధికంగా నష్టపోవడం మార్కెట్ల పతనాన్ని శాసించింది. మరోవైపు, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు మాత్రం మదుపరులను ఆకట్టుకున్నాయి. రంగాలవారీగా చూస్తే టెలికం 2.97 శాతం, ఆటో 2.95 శాతం, టెక్‌ 2.63 శాతం, ఐటీ 2.48 శాతం చొప్పున పతనం చెందాయి. 

VIDEOS

logo