గురువారం 29 అక్టోబర్ 2020
Business - Jun 20, 2020 , 01:15:32

మార్కెట్‌కు రిలయన్స్‌ జోష్‌

మార్కెట్‌కు రిలయన్స్‌ జోష్‌

ముంబై, జూన్‌ 19: రిలయన్స్‌ దన్నుతో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. నిర్దేశిత గడువుకు ముందే రుణాల నుంచి రిలయన్స్‌ విముక్తి పొందిందని సంస్థ అధిపతి ముకేశ్‌ అంబానీ చేసిన ప్రకటన మదుపరులలో కొనుగోళ్ల జోష్‌ను నింపింది. మదుపరులు రిలయన్స్‌ షేర్ల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 523.68 పాయింట్లు పుంజుకుని 34,731.73 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 640.32 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకడం గమనార్హం. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 152.75 పాయింట్లు పెరిగి 10,244.40 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ మదుపరుల పెట్టుబడుల  కూడా మార్కెట్‌కు లాభించింది.

రూ.11 లక్షల కోట్లు దాటిన మార్కెట్‌ విలువ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో 6 శాతానికిపైగా ఎగిసింది. ఆల్‌టైమ్‌ హై రికార్డు స్థాయికి చేరింది. బీఎస్‌ఈలో 6.23 శాతం వృద్ధితో రూ.1,759.50 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈలో 6.47 శాతం పుంజుకుని రూ.1,763.20 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలోనైతే ఒకానొక దశలో 

7.99 శాతం పెరుగుదలతో రూ.1,788.60గా నమోదైంది. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌పై రూ.11,15,418.03 కోట్లను తాకింది. ఈ ఒక్కరోజే రూ.65,477.03 కోట్లు ఎగబాకింది.

సెన్సెక్స్‌ 524, నిఫ్టీ 153 పాయింట్లు వృద్ధి

ప్రపంచంలోనే 10 అత్యంత విలువైన స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో బీఎస్‌ఈకి 10వ స్థానం లభించినట్లు వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్సేంజెస్‌ ప్రకటించింది. 19.3 ట్రిలియన్‌ డాలర్లతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ మొదటి స్థానంలో ఉండగా, 1.7 ట్రిలియన్‌ డాలర్లతో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ 10వ స్థానంలో ఉన్నది.