బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 04, 2020 , 00:02:45

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
  • సెన్సెక్స్‌ 38,624 480
  • నిఫ్టీ11,303 170

ముంబై, మార్చి 3: ఎన్నాళ్లకెన్నాళ్లకు..లాభాల జాడ ఎరుగని మదుపరి ఉబ్బితబ్బిపోయారు. వరుసగా ఏడు రోజులుగా నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలబాటపట్టాయి. కరోనా వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండాపలు చర్యలు తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మొత్తంగా మార్కెట్లను ఎట్టకేలకు లాభాల బాటపట్టించాయి.  తీవ్ర ఊగిసలాటల మధ్య ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ ఒక దశలో 600 పాయింట్ల వరకు లాభపడింది. చివరకు  479.68 పాయింట్లు లేదా 1.26 శాతం లాభపడి 38,623.70 వద్ద ముగిసింది. మార్కెట్లో 30 విభాగాల్లో 28 లాభపడటం విశేషం. గడిచిన ఏడు రోజుల్లో 3 వేల పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి.


 జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 170.55 పాయింట్లు అందుకొని 11,303.30 వద్ద స్థిరపడింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లో సన్‌ఫార్మా 6.64 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హీరో మోటోకార్ప్‌ల షేర్లు నాలుగు శాతానికి పైగా ఎగబాకాయి. వీటితోపాటు హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌, టీసీఎస్‌, మారుతి, కొటక్‌ బ్యాంక్‌, నెస్లె, ఎల్‌అండ్‌ టీ, మహీంద్రా అండ్‌ మహాంద్రా, టెక్‌ మహీంద్రా, ఎస్బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్‌, ఇన్ఫోసిస్‌లు మదుపరులను ఆకట్టుకున్నాయి. కానీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు నష్టపోయాయి. 


రిజర్వు బ్యాంక్‌ నిర్ణయంతో జోష్‌

రిజర్వు బ్యాంక్‌ తీసుకున్న కీలక నిర్ణయం స్టాక్‌ మార్కెట్ల వరుస పతనానికి బ్రేకులు వేశాయి. కరోనా వైరస్‌తో దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడనున్న ప్రతికూల పరిస్థితులపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటన మార్కెట్లకు ఆక్సిజన్‌లా పనిచేసింది. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు తోడవడం మార్కెట్లలో జోష్‌పెంచింది. రంగాలవారీగా చూస్తే మెటల్‌ అత్యధికంగా 5.67 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచాయి. అలాగే పవర్‌ 3.99 శాతం, యుటిలిటీ 3.94 శాతం, హెల్త్‌కేర్‌ 3.77 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 3 శాతం, ఐటీ, మెటల్‌, ఎనర్జీ, రియల్టీ రంగ సూచీలు కూడా రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. 


రూపాయి ఢమాల్‌

రూపాయి.. రూపాయి నీవు ఏమి అవుతావ్‌ అంటే పతనమవుతాను తప్పా..పెరుగనంటే పెరుగనంటున్నది. స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసినప్పటికీ కరెన్సీ మాత్రం నష్టాల్లోకి జారుకున్నది. కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవనున్నట్లు వచ్చిన సంకేతాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమనడంతో మారకం విలువ 16 నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి  విలువ 43 పైసలు పడిపోయి 73.19 వద్ద స్థిరపడింది. డాలర్‌ను కొనుగోలు చేయడానికి బ్యాంకర్లు, ఎగుమతిదారులు ఎగబడటంతో రూపాయికి చిల్లులు పడ్డాయని ఫారెక్స్‌ డీలర్‌ వెల్లడించారు. 72.50 వద్ద ప్రారంభమైన డాలర్‌-రుపీ ఎక్సేంజ్‌ రేటు ఒక దశలో 72.43కి బలపడిని మారకం 73.34 కనిష్ఠ స్థాయిని తాకింది.  నవంబర్‌ 1, 2018 తర్వాత రూపాయికి ఇదే కనిష్ఠ  ముగింపు. వరుసగా మూడు రోజుల్లో విలువ 160 పైసలు కోల్పోయింది. 


logo
>>>>>>