గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 02:06:26

మార్కెట్లకు ఇన్ఫీ దన్ను

మార్కెట్లకు ఇన్ఫీ దన్ను

  • సెన్సెక్స్‌ 420, నిఫ్టీ 122 పాయింట్ల లాభం

ముంబై: ఇన్ఫోసిస్‌ ఇచ్చిన దన్నుతో స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అమ్మకాలతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురైనప్పటికీ దేశీయ సూచీలు మాత్రం కదంతొక్కాయి. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 419.87 పాయింట్లు లేదా 1.16 శాతం లాభపడి 36,471.68కి చేరుకున్నది. ప్రారంభంలోనే 36,400 స్థాయిని తాకిన సూచీ మధ్యలో 36 వేల పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివర్లో పెట్టుబడిదారులు ఎగబడి కొనుగోళ్లు చేయడంతో సూచీ తిరిగి కోలుకున్నది. మరోవైపు జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 121.75 పాయింట్లు(1.15 శాతం) అందుకొని 10,739.95 వద్ద స్థిరపడింది. 

టాప్‌ గెయినర్‌గా ఇన్ఫీ

 ఇన్ఫోసిస్‌ వరుసగా రెండో రోజు షేరు ధర అమాంతం దూసుకుపోయింది. అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో ప్రారంభంలోనే 15 శాతంవరకు లాభపడటంతో మదుపరులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రారంభమైన గంటలోనే  అప్పర్‌ లిమిట్‌ రూ.955ని తాకిన కంపెనీ షేరు ధర చివరకు 9.56 శాతం లాభంతో రూ.910.90 వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 9.51 శాతం ఎగబాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.33.853.40 కోట్లు పెరిగి రూ.3,87,966.40 కోట్లకు చేరుకున్నది. దీంతోపాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా 3.81 శాతం, నెస్లె 3.31 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.98 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 2.47 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతి, ఎస్బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, బజాజ్‌ల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. కానీ, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీలు రెండు శాతం వరకు మార్కెట్‌ వాటాను కోల్పోయాయి. 


logo