మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 14, 2020 , 01:16:50

స్టాక్ మార్కెట్ల జోరు

స్టాక్ మార్కెట్ల జోరు
  • 260 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ l 73 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ

ముంబై, జనవరి 13: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. టెక్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీతో దేశీయ సూచీలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అమెరికా-చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా వాయిదాపడుతున్న వాణిజ్య ఒప్పందంపై ఈ వారంలోనే సంతకాలు చేయనుండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 42 వేల దిశగా, నిఫ్టీ 12,300 పాయింట్లకు పైకి చేరుకున్నది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 259.97 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 41,859.69, నిఫ్టీ 72.75 పాయింట్లు అధికమై 12,329.55 వద్ద ముగిశాయి. రెండు సూచీలకు ఇదే చారిత్రక గరిష్ఠ స్థాయి ముగింపు కావడం విశేషం.


ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు, పారిశ్రామికరంగం మళ్లీ వృద్ధి బాట పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలు దలాల్‌స్ట్రీట్ వర్గాలను కొనుగోళ్ల వైపు నడిపించాయని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వరుసగా మూడు నెలలుగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న పారిశ్రామిక రంగం నవంబర్ నెలకుగాను 1.8 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో ఇన్ఫోసిస్ షేరు ధర 4.76 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యునిలీవర్‌లు రెండు శాతానికి పైగా లాభపడగా, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్‌లు ఒక్క శాతానికి పైగా మార్కెట్ వాటాను పెంచుకున్నాయి.

వీటితోపాటు ఏషియన్ పెయింట్స్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, కొటక్‌బ్యాంక్, మారుతి, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటోకార్ప్‌లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. కానీ, టీసీఎస్ 1.03 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. ఎస్బీఐ, బజాజ్-ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, నెస్లె ఇండియాలు నష్టపోయాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు కుదుటపడుతుండటం, కార్పొరేట్ల ఆశాజనక ఫలితాలు మార్కెట్లను ముందుండి నడిపించాయని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. రంగాలవారీగా చూస్తే రియల్టీ, ఐటీ, టెక్, టెలికం, యుటిలిటీ, మెటల్, పవర్‌లు రెండు శాతానికి పైగా అధికమయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

కొనసాగుతున్న రూపాయి ర్యాలీ

రూపాయి ర్యాలీ కొనసాగుతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 8 పైసలు అందుకొని 70.86కి చేరుకున్నది. పెట్టుబడిదారుల్లో నెలకొన్న సెంటిమెంట్, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ఆశావాద పరిస్థితులతో రూపాయి మరింత బలపడింది. వరుసగా కరెన్సీ విలువ పెరుగడం ఇది ఐదోసారి. 106 పైసలు అధికమైంది.  


logo
>>>>>>