శుక్రవారం 10 జూలై 2020
Business - Mar 25, 2020 , 23:28:42

రంకేసిన బుల్‌

రంకేసిన బుల్‌

  • లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
  • పదేండ్లలోనే గరిష్ఠ వృద్ధి
  • ఉద్దీపనాలపై ఆశలు
  • కలిసొచ్చిన యూఎస్‌ ప్యాకేజీ
  • సెన్సెక్స్‌ 1862 పాయింట్లు, నిఫ్టీ 517 పాయింట్లు వృద్ధి

ముంబై, మార్చి 25: కరోనా వైరస్‌ ధాటికి గృహ నిర్బంధంలో ఉన్న బుల్‌ కోలుకున్నది. బుధవారం స్టాక్‌ మార్కెట్లను దున్నేసింది. బుల్‌ రంకెతో మార్కెట్లను కమ్ముకున్న బేరిష్‌ మబ్బులు కరిగిపోయి లాభాల వర్షం కురిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల మధ్య ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో కదలాడిన సూచీలు.. చివరిదాకా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాయి. దీంతో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 1,861.75 పాయింట్లు లేదా 6.98 శాతం ఎగిసి 28,535.78 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 516.80 పాయింట్లు లేదా 6.62 శాతం ఎగబాకి 8,317.85 వద్ద నిలిచింది. కేవలం ఒక్కరోజే సూచీలు ఈ స్థాయిలో లాభాలను అందుకోవడం గడిచిన పదేండ్లకుపైగా కాలంలో ఇదే కావడం గమనార్హం. మంగళవారం కూడా సూచీలు లాభాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు భారత్‌సహా అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుస భీకర నష్టాలనూ చూశాం. 

ఈ ఒక్క నెలలోనే సెన్సెక్స్‌ 15వేల పాయింట్లు కోల్పోగా.. రూ.50 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైపోయింది. అయితే ఉద్దీపనాలపై మదుపరులు పెట్టుకున్న ఆశలు.. మళ్లీ మార్కెట్లను నిలబెట్టాయి. 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా సిద్ధం కావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా బలపరిచింది. దీనికి త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వనుందన్న అంచనాలు తోడైయ్యాయి. అంతేగాక 21 రోజుల లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి సాధ్యమేనన్న నిపుణుల అభిప్రాయాలూ మదుపరులలో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపాయి. దీంతో అమ్మకాల స్థానంలో కొనుగోళ్లు వచ్చిచేరాయి. సూచీలు పరుగులు పెట్టగా.. లాభాల వరద పారింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతి సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర షేర్లు 15 శాతం వరకు పుంజుకున్నాయి. ఇంధన, ఆర్థిక, బ్యాంకింగ్‌, ఆటో, చమురు, గ్యాస్‌, బేసిక్‌ మెటీరియల్స్‌ రంగాలకు మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలూ 3.53 శాతం వరకు పెరిగాయి. అయితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్జీసీ, ఐటీసీ, బజాజ్‌ ఆటో వంటి పలు షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టాక్‌ బ్రోకర్లు తమ కార్యాలయాలకు చేరుకోవడం ఇబ్బందిగా మారుతున్నది. 

రూ.7 లక్షల కోట్లు పెరిగిన సంపద

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండు రోజులు లాభాల్లోనే ముగియడంతో మదుపరుల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్‌ ఈ రెండు రోజుల్లో 2,555 పాయింట్లు ఎగబాకగా, బీఎస్‌ఈలో నమోదైన మొత్తం సంస్థల మార్కెట్‌ విలువ రూ.6,63,240.78 కోట్లు ఎగిసి రూ. 1,08,50,177.06 కోట్లకు చేరింది.  

మళ్లీ విలువైన సంస్థగా రిలయన్స్‌

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పాతాళానికి పడిపోవడంతో భారీ గా నష్టపోయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మళ్లీ తేరుకున్నది. బుధవారం కంపెనీ షేరు ధర అమాంతం పెరుగడంతో టీసీఎస్‌ను దాటేసి అత్యంత విలువైన సంస్థగా మళ్లీ అవతరించింది. స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి షేరు 14.65 శాతం పెరిగి రూ.1,081.25 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 22.25 శాతం లాభపడిన షేరు చివరకు లాభాలను నిలుపుకోలేకపోయింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ కంపెనీ షేరు 13. 82 శాతం ఎగబాకి రూ.1,074 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 87,576.98 కోట్లు పెరిగి రూ.  6,85,433.30 కోట్లకు చేరుకున్నది. 


logo