శనివారం 06 జూన్ 2020
Business - May 18, 2020 , 23:51:12

మార్కెట్లు బేజారు

మార్కెట్లు బేజారు

  • సెన్సెక్స్‌ 1,069, నిఫ్టీ 313 పాయింట్ల క్షీణత
  • రూ.3.65 లక్షలు కోల్పోయిన మదుపరులు

ముంబై, మే 18: ఉద్దీపనల ప్యాకేజీ స్టాక్‌ మార్కెట్ల ఉసురుతీసింది. కరోనా కాటుతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ దలాల్‌స్ట్రీట్‌ వర్గాలను మెప్పించలేకపోయింది. లాక్‌డౌన్‌ పొడిగింపుతోపాటు దివాలా చట్టం నుంచి ఏడాదిపాటు కంపెనీలకు మినహాయింపు ఇవ్వాలన్న నిర్ణయం మార్కెట్ల భారీ పతనానికి కారణమయ్యాయి. ఆర్థిక, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఆరు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మొత్తంమీద సోమవారం మార్కెట్లకు బ్లాక్‌ మండేగా నిలిచింది. ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు 1,068.75 పాయింట్లు లేదా 3.44 శాతం నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30,028.98కి జారుకోగా, జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 313.60 పాయింట్లు లేదా 3.43 శాతం తగ్గి 8,823.25కి పరిమితమైంది. దీంతో రూ.3.65 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది.  బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.3,65,469.88 కోట్లు తరిగిపోయి రూ.1,19,00,649.71 కోట్లకు పడిపోయింది. ఉద్దీపన ప్యాకేజీ నిరాశ కలిగించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో సూచీ 3.4 శాతం నష్టపోయింది.  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు ధర 10 శాతానికిపైగా పతనమై టాప్‌ లూజర్‌గా నిలిచింది.  దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌లు షేర్లు నష్టపోయాయి. కానీ టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

  • రంగాలవారీగా చూస్తే బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, ఆటో, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ షేర్లు 7 శాతం వరకు పతనమయ్యాయి. 
  • మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు 3.87 శాతం వరకు క్షీణించాయి.
  • లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో మల్టీప్లెక్స్‌, హోటల్‌ రంగ షేర్లు 14 శాతానికిపైగా నష్టపోయాయి. 
  • రక్షణ రంగ షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడ్డ షేర్లు చివరకు స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. 


logo