శనివారం 16 జనవరి 2021
Business - Nov 20, 2020 , 02:22:38

రికార్డులకు బ్రేక్‌

రికార్డులకు బ్రేక్‌

  • వెంటాడిన కరోనా భయాలు 
  • భారీ నష్టాల్లో మార్కెట్లు 
  • సెన్సెక్స్‌ 580, నిఫ్టీ 167 పాయింట్లు పతనం

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్ల రికార్డు పరుగులకు బ్రేక్‌ పడింది. కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనైయ్యారు. దీంతో గురువారం సూచీలు భారీగా నష్టపోయాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 580.09 పాయింట్లు లేదా 1.31 శాతం క్షీణించి 43,599.96 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 166.55 పాయింట్లు లేదా 1.29 శాతం దిగజారి 12,771.70 వద్ద నిలిచింది. దీంతో మూడు రోజుల లాభాలకు తెరపడినైట్లెంది. ఈ నెలలో మార్కెట్లు నష్టాల్లో ముగియడం ఇది రెండోసారి.

ఇంట్రా-డేలో జోరు

నిజానికి ఒకానొక దశలో సూచీలు సరికొత్త స్థాయికి ఎగబాకి వరుస లాభాలను కొనసాగిస్తాయనిపించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఇంట్రా-డేలో సెన్సెక్స్‌ 44,230 పాయింట్లను, నిఫ్టీ 12,963 పాయింట్లను తాకాయి. కానీ ఒక్కసారిగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, టెలికం, రియల్టీ, మెటల్‌, ఎనర్జీ, ఆటో సూచీల్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఆల్‌టైమ్‌ హై స్థాయిల నుంచి సూచీలు పడిపోక తప్పలేదు. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఆశాజనకంగా సాగుతుండటంతో మదుపరులు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అందుకే స్టాక్‌ మార్కెట్లు వరుసగా రికార్డులను సృష్టించాయి. కానీ కేసుల తీవ్రత అధికమవుతుండటంతో భయాలు చుట్టుముట్టాయని మార్కెట్‌ నిపుణులు తాజా ట్రేడింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు. 

ఇతర కారణాలు

ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 8 పైసలు పతనం కావడం, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్‌లో ఎస్బీఐ షేర్‌ విలువ అత్యధికంగా 4.88 శాతం క్షీణించింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లూ నష్టాలకు లోనయ్యాయి.

కోలుకోని ఎల్‌వీబీ షేర్లు 

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) షేర్లు గురువారం కూడా కుప్పకూలాయి. 20 శాతం విలువ దిగజారడంతో స్టాక్‌ ఎక్సేంజ్‌లు ట్రేడింగ్‌ను నిలిపివేశాయి. బీఎస్‌ఈలో 19.76 శాతం క్షీణించి రూ.9.95 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 19.68 శాతం పడిపోయి రూ.10 వద్ద స్థిరపడింది. ఎల్‌వీబీపై మారటోరి యం నేపథ్యంలో బుధవారం కూడా ఆ బ్యాంకు షేరు విలువ 20 శాతం క్షీణించిన విషయం తెలిసిందే.

రూ.1.41 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపరుల సంపద గురువారం ఒక్కరోజే దాదాపు లక్షన్నర కోట్ల వరకు ఆవిరైపోయింది. సెన్సెక్స్‌ 580 పాయింట్లు కోల్పోయిన నేపథ్యంలో బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ రూ.170.03 లక్షల కోట్లకు పరిమితమైంది. బుధవారం ఇది రూ.171.44 లక్షల కోట్లుగా ఉన్నది. దీంతో గురువారం రూ.1.41 లక్షల కోట్ల నష్టం వాటిల్లినైట్లెంది.