శనివారం 30 మే 2020
Business - May 20, 2020 , 23:44:30

చివరి గంటలో కొనుగోళ్లు

చివరి గంటలో కొనుగోళ్లు

  • -సెన్సెక్స్‌ 622, నిఫ్టీ 187 పాయింట్ల లాభం

ముంబై, మే 20: స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. ఊగిసలాటలో కొనసాగిన సూచీలకు చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ ఏకంగా 622.44 పాయింట్లు (2.06%) లాభపడి 30,818.61 వద్దకు చేరుకున్నది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా మరో 187.45 పాయింట్లు (2.11%) అందుకొని 9 వేల మార్క్‌నుదాటి 9,066.55 వద్ద నిలిచింది. బ్లూచిప్‌ సంస్థలను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు ఆసక్తి చూపడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. మరోవైపు ఆశాజనక కార్పొరేట్ల ఫలితాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం మరింత పెరిగిందని, కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మరిన్ని కీలక చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు కూడా మార్కెట్లకు ఉత్తేజాన్నిచ్చాయి. మార్కెట్లో మహీంద్రా అండ్‌ మహీంద్రా 5.92 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా..ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ మూడు శాతం వరకు నష్టపోయాయి. డీ-మార్ట్‌ పేరు తో రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న అవె న్యూ సూపర్‌మార్ట్స్‌ 11వ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. కంపెనీ షేరు ధర 5 శాతం లాభపడటంతో మార్కెట్‌ విలువ రూ.1,58,902.37 కోట్లకు చేరుకున్నది. 


logo