గురువారం 28 మే 2020
Business - May 15, 2020 , 00:30:59

ఉద్దీపన ఉత్సాహం ఆవిరి

ఉద్దీపన ఉత్సాహం ఆవిరి

  • భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు 
  • సెన్సెక్స్‌ 886, నిఫ్టీ 241 పాయింట్లు పతనం

ముంబై, మే 14: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలపాలయ్యాయి. కొవిడ్‌-19 ఉద్దీపన ఉత్సాహం మదుపరుల్లో కేవలం ఒక్కరోజే కనిపించింది. గురువారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 885.72 పాయింట్లు లేదా 2.77 శాతం క్షీణించి 31,122.89 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 240.80 పాయింట్లు లేదా 2.57 శాతం పడిపోయి 9,142.75 వద్ద నిలిచింది. ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీ సమర్థతపై మదుపరుల్లో ఏర్పడిన అనుమానాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే ఒకానొక దశలో సెన్సెక్స్‌ 955 పాయింట్లకుపైగా దిగజారింది. టెక్‌ మహీంద్రా షేర్‌ విలువ అత్యధికంగా 5.24 శాతం పతనమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల మెగా ఉద్దీపనను ప్రకటించిన విషయం తెలిసిందే. 

అయినా ఇప్పట్లో దేశ జీడీపీ కోలుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదన్న భావన బలంగా ఇన్వెస్టర్ల వైపు నుంచి వ్యక్తమవుతున్నదని వారు చెప్తున్నారు. కాగా, ఐటీ, ఇంధన, టెక్నాలజీ, ఫైనాన్స్‌, మెటల్‌, బ్యాంకింగ్‌, చమురు, గ్యాస్‌, విద్యుత్‌, నిర్మాణ రంగ సూచీలు 3.60 శాతం మేర నష్టపోయాయి. హెల్త్‌కేర్‌, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల షేర్లు లాభాలను అందుకున్నాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లోనే కదలాడుతున్నాయి. కరోనా వైరస్‌ ఎప్పటికీ ఉండవచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యలు సైతం గ్లోబల్‌ మార్కెట్లను కుదిపేశాయి. ఈ పరిణామం కూడా భారతీయ స్టాక్‌ మార్కెట్లను కుంగదీసింది.

రూ.2 లక్షల కోట్ల సంపద మటాష్‌

స్టాక్‌ మార్కెట్ల నష్టాలతో గురువారం ఒక్కరోజే రూ.2 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్‌ 886 పాయింట్లు పడిపోవడంతో బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ రూ.1,99,619.9 కోట్లు క్షీణించి రూ.1,22,68,099.91 కోట్లకు దిగింది. బీఎస్‌ఈలో 1,360 సంస్థలు నష్టపోగా, 968 కంపెనీలు లాభాల్లో ముగిశాయి. 152 సంస్థల షేర్ల విలువ మాత్రం యథాతథంగా ఉన్నది.


logo