మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Business - Aug 05, 2020 , 02:07:16

మార్కెట్లకు రిల్‌ కిక్కు భారీ లాభాల్లో సూచీలు

మార్కెట్లకు రిల్‌ కిక్కు భారీ లాభాల్లో సూచీలు

  • సెన్సెక్స్‌ 748, నిఫ్టీ 204 పాయింట్లు వృద్ధి

ముంబై, ఆగస్టు 4: వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ లాభాలను సంతరించుకున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (రిల్‌), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు మదుపరులను విశేషంగా ఆకట్టుకోవడంతో మంగళవారం సూచీలు పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 748.31 పాయింట్లు లేదా 2.03 శాతం పుంజుకుని 37,687.91 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 203.65 పాయింట్లు లేదా 1.87 శాతం ఎగబాకి 11,095.25 వద్ద నిలిచింది. గత నాలుగు రోజులుగా వరుసగా స్టాక్‌ మార్కెట్లు నష్టాలకే పరిమితమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య మదుపరులు మళ్లీ పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చారు. ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ ఆస్తులను ముకేశ్‌ అంబానీ హస్తగతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆర్‌ఐఎల్‌ షేర్‌ విలువ సెన్సెక్స్‌లో అత్యధికంగా 7.10 శాతం ఎగబాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ విలువ కూడా 3.94 శాతం ఎగిసింది. బ్యాంక్‌ కొత్త సీఈవో, ఎండీగా శశిధర్‌ జగ్దీశన్‌ నియామకానికి ఆర్బీఐ అనుమతివ్వడం మదుపరులను మెప్పించింది. మారుతి సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లూ లాభాలను అందుకున్నాయి. అయితే టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. 

రూ.2 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

మదుపరుల సంపద ఈ ఒక్కరోజే రూ.2 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ రూ.2,08,395.53 కోట్లు ఎగిసి రూ.1,48,23,563.81 కోట్లను తాకింది. విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడుల రాక మార్కెట్‌ సెంటిమెంట్‌ను పెంచిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆసియా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు లాభాల్లోనే కదలాడాయి. ఈ పరిణామం కూడా దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది.


logo