సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 19, 2020 , 23:54:00

మార్కెట్లను వదలని కరోనా భయాలు

మార్కెట్లను వదలని కరోనా భయాలు

-వరుసగా నాలుగో రోజు భారీ నష్టాలు

-సెన్సెక్స్‌ 581, నిఫ్టీ 205 పాయింట్ల నష్టం

ముంబై, మార్చి 19: స్టాక్‌ మార్కెట్ల నష్టాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటున్నట్లు వచ్చిన భయాలు మార్కెట్లను చుట్టుముట్టాయి. ఫలితంగా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఒక దశలో భారీగా లాభపడ్డాయి. మధ్యాహ్నాం తర్వాత ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు రూపాయి రికార్డు స్థాయికి పతనమవడం దలాల్‌స్ట్రీట్‌లో ఆందోళనను మరింత పెంచింది. 2,600 పాయింట్లకు పైగా స్థాయిలో కదలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 581.28 పాయింట్లు (2.01 శాతం) తగ్గి 28,288.23 వద్దకు జారుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 205.35 పాయింట్లు(2.42 శాతం) క్షీణించి 8,263.45 వద్ద ముగిసింది. గడిచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 5,815 పాయింట్లు పతనం చెందడంతో మదుపరులు రూ.19.49 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.19,49,461.82 కోట్లు తగ్గి రూ.1,09,76,781 కోట్లకు పడిపోయింది. కాగా, గురువారం 1,200 కంపెనీల షేర్లు ఏడాది కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. వీటితోపాటు మార్కెట్లో బజాజ్‌ ఫైనాన్స్‌ 10.24 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు మారుతి 9.85 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 9.50 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 9.28 శాతం, టెక్‌ మహీంద్రా 8.43 శాతం, ఓఎన్‌జీసీ 7.35 శాతం వరకు కోల్పోయాయి.

 కొనసాగుతున్న ఆర్‌ఐఎల్‌ షేరు పతనం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు వరుసగా నాలుగో రోజు పతనాన్ని మూటగట్టుకున్నది. గురువారం ఇంట్రాడేలో 8 శాతానికి పతనమైన కంపెనీ షేరు ధర చివరకు 5.34 శాతం తగ్గి రూ.917.10 వద్ద నిలిచింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 5.24 శాతం కోల్పోయి రూ.917.70 వద్ద పరిమితమైంది. గత నాలుగు సెషన్లలో షేరు ధర 17.14 శాతం పతనమవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,20,311.78 కోట్లు కోల్పోయింది. దీంతో టీసీఎస్‌ అత్యంత విలువైన సంస్థగా అవతరించగా, రిలయన్స్‌ రెండో స్థానానికి పరిమితమైంది. 

విమానయాన రంగ షేర్లు విలవిల..

వరుసగా ఏడో రోజు విమానయాన రంగ షేర్లు కుదేలయ్యాయి. ఈ రంగానికి చెందిన స్పైస్‌జెట్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు వరుసగా ఏడు రోజుల్లో 40 శాతానికి పైగా పతనం చెందాయి. స్పైస్‌జెట్‌ షేరు 46 శాతం తగ్గగా, అదే ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ 25 శాతం పడిపోయింది. 


logo